హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ఇటీవలే ”ది రానా దగ్గుబాటి షో” అనే టీవీ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ షోకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రెగ్యులర్ టాక్ షోలా కాకుండా.. ఎలాంటి స్క్రిప్ట్ లేకుండా ఒక యునిక్ కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసారు. ఇప్పటి వరకూ మూడు ఎపిసోడ్స్ అందుబాటులోకి వచ్చాయి. నేడు రానా పుట్టినరోజు సందర్భంగా లేటెస్ట్ ఎపిసోడ్ ని స్ట్రీమింగ్ చేసారు. ఇందులో దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి – సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సెలబ్రిటీ గెస్టులుగా పాల్గొన్నారు.
‘మాస్టర్ ఇన్ఫ్లుయెన్సర్స్’ అనే పేరుతో వచ్చిన ‘ది రానా దగ్గుబాటి షో’ నాలుగో ఎపిసోడ్ కి అనూహ్య స్పందన లభిస్తోంది. తనను ప్రభావితం చేసిన మాస్టర్స్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ లతో రానా సాగించిన సరదా సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటి వరకూ ఎన్నో ఇంటర్వ్యూలు, టాక్ షోలలో పాల్గొన్న జక్కన్న.. రానా షో వేదికగా తొలిసారిగా తన ఇంటర్మీడియేట్ లవ్ స్టోరీని బయటపెట్టాడు. తాను ఒక అమ్మాయిని ఇష్టపడ్డానని, క్లాస్ లో ఉన్న అందరికీ ఆ విషయం తెలుసని, కానీ ఆమెతో ఒక్కసారి మాత్రమే మాట్లాడానని రాజమౌళి తెలిపారు.
”ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఓ అమ్మాయి అంటే ఇష్టం ఉండేది. కానీ మాట్లాడాలంటే భయం. నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నానని మా క్లాసులో అబ్బాయిలందరికీ తెలుసు. నన్ను ఈ విషయం మీద ఏడిపించేవారు. సంవత్సరం మొత్తంలో ఆమెతో ఒకే ఒక్కసారి మాట్లాడాను. అది కూడా చాలా కష్టం మీద మాట్లాడాను. ట్యూషన్ ఫీజ్ కట్టావా? అని అడిగాను” అంటూ రాజమౌళి నవ్వుతూ తన ప్రేమకథను వివరించారు. అది విన్న రానా దగ్గుబాటి పగలబడి నవ్వాడు. ఇక ఆర్జీవీ సైతం రానాతో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
గతంలో రానా దగ్గుబాటి ‘నెం.1యారి’ అనే టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఓటీటీలో సూపర్ హిట్టైన ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్ రాజమౌళి కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ‘ది రానా దగ్గుబాటి షో’లో మరోసారి రానాతో కలిసి దిగ్గజ దర్శకుడు సందడి చేసారు. సరదా సరదాగా సాగిన ఈ షోలో రాజమౌళి, రాంగోపాల్ వర్మ పంచుకున్న మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్లాట్ ఫార్మ్ లో ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.
ఇకపోతే ‘ది రానా దగ్గుబాటి షో’ ఫస్ట్ ఎపిసోడ్ లో నాని, తేజ సజ్జా, ప్రియాంక మోహన్ పాల్గొన్నారు. సిద్ధూ జొన్నలగడ్డ, శ్రీలీల రెండో ఎపిసోడ్ లో సందడి చేసారు. మూడో ఎపిసోడ్ కు రానా మేనత్త కొడుకు అక్కినేని నాగచైతన్య, సతీమణి మిహికా బజాజ్, సోదరి మాళవిక, సుమంత్ తో పాటుగా మరికొందరు కుటుంబ సభ్యులు వచ్చారు. సీజన్-1లో 8 ఎపిసోడ్స్ ప్లాన్ చేయగా.. రాబోయే రోజుల్లో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, రిషబ్ శెట్టి వంటి పలువురు సినీ సెలబ్రిటీలు ఈ షోలో కనిపించనున్నారు.