నిర్మాత అనే పదానికి సరికొత్త ఇమేజ్ తీసుకొచ్చిన టాలీవుడ్ నిర్మాతగా దిల్ రాజుకున్న ఛరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిర్మాత పాత్రను పర్ ఫెక్టుగా పోషించే దిల్ రాజు లెక్కలే వేరుగా ఉంటాయని చెబుతారు. నరాలు తెగిపోయేంత టెన్షన్ లోనూ ఆ విషయాన్ని ముఖం మీద కనిపించకుండా చేయటంతో పాటు.. కూల్ గా వరుస పెట్టి సినిమాల్ని నిర్మించే అతి కొద్ది మంది నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. తాజాగా సంక్రాంతికి తమిళ స్టార్ హీరో విజయ్ తో వారిసు పేరుతో తమిళ చిత్రం.. అదే సినిమాను తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ చేయటం తెలిసిందే.
ఈ మూవీకి మిక్స్ డ్ రివ్యూలు వచ్చాయి. అయితే.. ఈ సినిమాను ప్రమోట్ చేయటానికి దిల్ రాజు భారీగా కష్టపడ్డారని చెబుతున్నారు. మీడియాలో ఈ సినిమాకు హైప్ తేవటానికి తీవ్రంగా కసరత్తు చేశారు. ఈ క్రమంలో మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చిన దిల్ రాజు.. తన లైఫ్ లో జరిగిన రియల్ లవ్ స్టోరీని తొలిసారి షేర్ చేసుకోవటం ఆసక్తికరంగా మారింది.
తన రెండో భార్య తేజస్వినితో తనకు ఎలా పరిచయమైంది? అది కాస్తా పెళ్లి వరకు ఎలా వెళ్లిందన్న విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. తన వ్యక్తిగత విషయాల్ని చాలా తక్కువగా మాట్లాడే దిల్ రాజు.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా తన రియల్ లవ్ స్టోరీపై ఓపెన్ అయ్యారు. దిల్ రాజు సతీమణి అనారోగ్యంతో మరణించటంతో తీవ్రమైన షాక్ కు గురయ్యారు. ఆ షాక్ తోనే తాను మూడేళ్ల వరకు మామూలు మనిషిని కాలేదన్నారు. అప్పుడే తనకు తేజస్వినితో పరిచయమైనట్లు చెప్పారు.
తాను తరచూ విమాన ప్రయాణాల్ని చేసేవాడినని.. ఆ క్రమంలో ఎయిర్ హోస్టెస్ గా ఉన్న తేజస్విని తాను తరచూ చేసేవాడినని చెప్పారు. తానే తేజస్విని మొదట ఇష్టపడ్డానని.. ఆమెతో మాట్లాడటం మెదలు పెట్టినట్లుగా చెప్పారు. పెళ్లి ప్రపోజల్ ఆమె మెందు పెట్టటానికి దాదాపు ఏడాది పాటు ఆమెను గమనిస్తూనే ఉన్నట్లుగా పేర్కొన్నారు. యాభై ఏళ్ల వయసులో దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నారు.
తమ క్యూట్ లవ్ స్టోరీ గురించి దిల్ రాజు సతీమణి కూడా ఓపెన్ అయ్యారు. దిల్ రాజు యూఎస్ కు వెళ్లే ఫ్లైట్ లో తరచూ కనిపించేవారని.. తొలిసారి తనను పెన్ను అడిగారని..అలా మొదలైన పరిచయం నెమ్మదిగా మాట్లాడుకునే వాళ్లమన్నారు. ఒకసారి తన ఫోన్ నెంబరు తీసుకున్నట్లు ఆమె చెప్పారు. అలా మొదలైన స్నేహం తర్వాతి కాలంలో ప్రేమగా మారటం.. పెళ్లి ప్రపోజల్ ను తీసుకొచ్చినట్లు చెప్పారు.
పెళ్లికి ముందు తేజస్వినికి సినిమాలు అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదని.. దిల్ రాజుతో ప్రేమలో పడిన తర్వాత గూగుల్ లో దిల్ రాజు దర్శకుడు కాదు నిర్మాత అన్న విషయాన్ని తాను తెలసుకున్నట్లు చెప్పారు. మూడేళ్ల క్రితం అదే 2020లో అత్యంత సన్నిహితులు కొద్దిమంది మధ్య పెళ్లి చేసుకున్న దిల్ రాజు.. తమ ప్రేమ కథకు అందమైన మలుపును పెళ్లి రూపంలో ఇచ్చారని చెప్పాలి. ఏమైనా.. రీల్ స్టోరీకి తీసిపోని రీతిలో దిల్ రాజు రియల్ లవ్ స్టోరీ ఉన్నట్లుగా చెప్పక తప్పదు.