అతడు ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన మేటి నటుడు. వందల కోట్ల ఆస్తిమంతుడు.. స్థితిమంతుడు. ఒక్కో సినిమాకి 100కోట్లు వసూలు చేస్తాడు. కానీ అతడి పెళ్లి కేవలం రూ.10 ఖర్చుతో పూర్తయింది. అయితే అందుకు కారణమైన పరిస్థితులు ఏమిటన్నది ఆరా తీస్తే షాకిచ్చే విషయాలే తెలిసాయి. ఇంతకీ ఎవరా హీరో? అంటే – మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.
అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ గతంలో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇరా ఖాన్ -జునైద్ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రీనా దత్తాను 1986లో వివాహం చేసుకునే సమయానికి అమీర్ ఖాన్ సాధారణ యువకుడు మాత్రమే. నిజానికి అమీర్ తన పొరుగున ఉన్న నటి రీనాకు ప్రపోజ్ చేసినప్పుడు మొదట నో చెప్పింది. కానీ తరువాత 80 ల ప్రారంభంలో డేటింగ్ ప్రారంభించారు. అమీర్ నటించిన ‘ఖయామత్ సే ఖయామత్ తక్’లోని ఒక పాటలో రీనా అతిధి పాత్రలో నటించారు. ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారింది.
అయితే తాను రీనా కోర్టు (రిజిస్ట్రార్ ఆఫీస్) వివాహాన్ని ఎంచుకున్నామని పెళ్లికి తన ఖర్చు రూ. 10 కంటే తక్కువేనని అమీర్ గతంలో వెల్లడించాడు. రీనాతో తన వివాహం చాలా ఎకనమికల్ (ఆర్థికంగా వెనకబాటు) అని రీడిఫ్‌కు ఇచ్చిన పాత ఇంటర్వ్యూలో అమీర్ వెల్లడించాడు. తమ పెళ్లి ఎలా జరిగిందో కూడా అమీర్ వివరించాడు. నేను ముగ్గురు సాక్షులతో కోర్టు సమక్షంలో రీనాను రహస్యంగా వివాహం చేసుకున్నాను. రీనాతో నా పెళ్లి అత్యంత సింపుల్ గా డబ్బుతో పని లేకుండా జరిగింది. నేను బస్ నం. 211 ఎక్కి 50 పైసల టికెట్ కొన్నాను. నేను బాంద్రా స్టేషన్ వెస్ట్‌లో దిగి, వంతెన దాటి, తూర్పున దిగి, హైవే వైపు నడిచాను. నేను ఆ హైవే దాటి, వివాహ రిజిస్ట్రార్ కార్యాలయం ఉన్న గృహ నిర్మాణ భవన్‌లోకి ప్రవేశించాను. కాబట్టి నా పెళ్లికి నాకు 10 రూపాయల కంటే తక్కువ ఖర్చు అయింది.. అని తెలిపాడు.
రీనాతో బ్రేకప్ గురించి అమీర్ చాలాసార్లు ఓపెనయ్యాడు. ఈ జంట 2002లో విడిపోయారు. అమీర్- రీనా జంట పిల్లలు ఇరా-జునైద్‌ల పెంపకం బాధ్యతను ఇద్దరూ తీసుకున్నారు. ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 6లో అమీర్ మాట్లాడుతూ “రీనాతో 16 సంవత్సరాల కాపురం నుంచి విడిపోయినప్పుడు అది మాకు మా కుటుంబాలకు ఎంతో బాధాకరమైనది. మేము సాధ్యమైనంత ఉత్తమంగా పరిస్థితిని ఎదుర్కోవటానికి ప్రయత్నించాము. విడిపోయిన తర్వాత రీనా .. నేను ఒకరిపై మరొకరు ప్రేమను లేదా గౌరవాన్ని కోల్పోలేదు” అని తెలిపారు. అమీర్ తన సెట్లో అసిస్టెంట్ డైరెక్టర్ కిరణ్ రావుని 2005లో వివాహం చేసుకున్నారు. ఆరేళ్ల తర్వాత ఈ జంట సరోగసీ ద్వారా తమ కుమారుడు ఆజాద్ రావ్ ఖాన్‌కు జన్మనిచ్చినట్లు ప్రకటించారు. 2021లో కిరణ్, అమీర్ విడిపోయారు.