ప్రేమ ఎవరి జీవితంలో ఎప్పుడు ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. అలాంటి ప్రేమ ఈ వయసులోనే పుట్టాలి అనే రూల్ ఏమైనా ఉంటుందా? ప్రేమించడానికి ప్రేమను పంచడానికి వయసుతో పని ఏముంది? ఏజ్ అనేది కేవలం నంబర్ మాత్రమే. అది శరీరానికి మాత్రమే. మనసుతో సంబంధం లేదు. ఈ విషయం మేం చెప్పడం లేదు.. ఇదిగో ఈ సెలబ్రెటీ కపుల్స్ చెబుతున్నారు. లేటు వయసులో నిజమైన ప్రేమను కొనుగొని పెళ్లిళ్లు చేసుకున్న దంపతులు ఎవరెవరు ఉన్నారో ఓసారి చూసేద్దాం..
1.సంజయ్ దత్
బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ తన జీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. సంజయ్ మొదటి వివాహం 1987లో రిచా శర్మతో జరిగింది. ఈ దంపతులకు త్రిషలా దత్ అనే కుమార్తె కూడా ఉంది. కానీ దురదృష్టవశాత్తు రిచా బ్రెయిన్ ట్యూమర్ కారణంగా మరణించారు. కొన్ని సంవత్సరాల తరువాత అతను రియా పిళ్లై అనే యువతిని మరో వివాహం చేసుకున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల వారు విడిపోయారు. 48 సంవత్సరాల వయస్సులో ఆయన మరో నిజమైన ప్రేమను కనుగొన్నారు. 2008లో ఆయన మాన్యతా దత్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.
2.కబీర్ బేడీ
ప్రముఖ నటుడు కబీర్ బేడీ కూడా లేటు వయసులో ప్రేమను పొందినవాడే. ఆయన తన జీవితంలో నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు. అతను 1969లో ప్రొతిమా బేడీ ని పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ జంట 1977లో విడిపోయింది. తర్వాత అతను బ్రిటీష్ ఫ్యాషన్ డిజైనర్ సుసాన్ హంఫ్రీస్‌ను వివాహం చేసుకోగా అది కూడా విడాకులకు దారితీసింది. టీవీ రేడియో ప్రెజెంటర్ నిక్కీ బేడీ కబీర్ ని మూడో వివాహం చేసుకోగా ఆ బంధం కూడా 2005లొ ముగిసింది. 2016లో 70 ఏళ్ల వయసులో ఆయన చివరగా అసలైన ప్రేమను పొందారు. పర్వీన్ దుసాంజ్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 29 సంవత్సరాలు కావడం విశేషం.
3.నీనా గుప్తా
సీనియర్ నటి నీనా గుప్తా కూడా లేటు వయసులో ప్రేమ పెళ్లి చేసుకుంది. 1989లో నీనా ఆమె అప్పటి ప్రియుడు మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ఓ కుమార్తెకు జన్మినిచ్చారు. అయితే.. అప్పటికే వివియన్‌కు పెళ్లి కావడంతో కూతురు మసాబాను నీనా ఒంటరిగా పెంచింది. చాలా సంవత్సరాల తర్వాత అంటే 2008లో ఆమె తన 50వ ఏట చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ మెహ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
4.ఊర్మిళ మటోండ్కర్
నటి ఊర్మిళా మటోండ్కర్ కూడా లేటు వయసులో ప్రేమ పెళ్లి చేసుకున్నవారే. 2016లో బాంద్రాలోని తన ఇంట్లో కాశ్మీర్‌కు చెందిన వ్యాపారవేత్త మొహ్సిన్ అక్తర్‌ను ఆమె మనువాడారు. పెళ్లి సమయానికి ఆమె వయసు 42ఏళ్లు కావడం గమనార్హం.
5.ఆశీష్ విద్యార్థి
ప్రముఖ నటుడు ఆశీష్ విద్యార్థి అరవై ఏండ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నారు. అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రూపాలి బారువాతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. గురువారం కోల్‌కతాలో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో తాము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని ఆశీష్ విద్యార్థి తెలిపారు.