ఏమండి లేత బుగ్గల లాయరు గారూ అంటూ అందాల తార చంద్రకళ టీజ్ చేస్తూ ఉంటే అన్నవరం దేవాలయ పరిసరాలలోని ఉద్యానవనంలో ఆరడుగుల అందగాడు శరత్ బాబు డ్యూయెట్ పాడారు. ఆ డ్యూయెట్ శరత్ బాబు ఫస్ట్ సారి హీరోగా నటించిన రామరాజ్యం మూవీలోనిది. తొలి సినిమాలోనే బ్రహ్మాండమైన డ్యూయెట్ పడింది. అది కూడా అప్పటికే స్టార్ హీరోయిన్ గా ఉన్న చంద్రకళతో. బాలూ గళంలోని చురుకుతనాన్ని తన 21 ఏళ్ళ దుడుకు తనంతో చక్కగా బాలన్స్ చేశాడు. అంతేనా హీరోయిన్ చంద్రకళ సీనియార్టీని తట్టుకుని మరీ తనదైన స్టైల్ లో హీరోగా రొమాన్స్ పండించాడు.
శరత్ బాబు జీవితం పూలపానుపు కాదు. ఈ రోజుకీ వెనకబడి ఉన్న శ్రీకాకుళం జిల్లా నుంచి యాభై ఏళ్ల క్రితం ఒక హీరో రాగలిగాడు అంటే దటీజ్ శరత్ బాబు అని చెప్పాలి. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో పుట్టి అక్కడే బీఎస్సీ దాకా చదివిన శరత్ బాబు హీరోగా నటుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగి పుట్టిన జిల్లాకు ఉత్తరాంధ్రాకు ఎంతో పేరు తెచ్చారు.
ఆయన అందానికి అప్పట్లో అంతా ఫిదా అయ్యేవారు అంటే అతిశయోక్తి కాదు. ఎంతో మంది అందాల తారలతో నటించిన శరత్ బాబు కేవలం 22 ఏళ్ల లేలేత ప్రాయంలోనే ఆనాటి సీనియర్ నటి తనకంటే అయిదారేళ్ళు పెద్దది అయిన రమాప్రభను పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి కొన్నాళ్ళ తరువాత విడాకులతో ముగిసింది.
ఈ పెళ్లి గురించి శరత్ బాబు అప్పట్లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలానే చెప్పారు. తన జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటుగా తప్పుగా దాన్ని ఆయన పేర్కొన్నారు. నా వయసు జస్ట్ 22 ఏళ్ళు. ఏమీ తెలియని ఆ వయసులో పెళ్ళి చేసుకోవడం ఏమిటి. నిజంగా దాన్ని పెళ్ళి అని కూడా నేను అనుకోను అని చెప్పేశారు. అది ఒక కలయిక మాత్రమే అని తేల్చేశారు.
ఇక తనను మోసం చేసి ఆస్తులు తీసుకున్నారు అని అప్పట్లో రమాప్రభ చేసిన ఆరోపణలకు కూడా శరత్ బాబు ఖండిస్తూ చాలానే చెప్పారు. నేను కోట్ల రూపాయ ఆస్తిని రమాప్రభ పేరిట. ఆమె తమ్ముడు పేరిట. వారిద్దరి పేరిట కొనిచ్చాను అని శరత్ బాబు చెప్పారు. ఈ విషయం తెలియకనే అందరూ తనను విమర్శిస్తున్నారు అని ఆయన నొచ్చుకున్నారు కూడా.
పాన్ ఇండియా నటుడిగా ఎదిగి భారతీయ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన శరత్ బాబు దిగ్దర్శకులు కె బాలచందర్ కె విశ్వనాధ్ బాపులకు మంచి చాయిస్ గా ఉండేవారు. టిపికల్ రోల్స్ ఆయన పోషించారు. ఆయన పాత్రలో ఒదిగి ఉండే విధానం కూడా గొప్పగా ఉంటుంది. సీతాకోక చిలుకలో సాగరసంగమం ఇది కధ కాదు వంటి చిత్రాలలోని ఆయన పాత్రలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
శరత్ బాబు పుట్టిన ఊరు ఆముదాలవలసలో ఈ రోజుకీ వారికి ఇల్లు ఉంది. అది శరత్ బాబు తన స్నేహితుడి నుంచి కొనుక్కున్నారు. తమకూ ఒక ఇల్లు ఉండాలని ఆయన అప్పట్లో భావించారు. కడు పేదరికం చూశారు. ఇండస్ట్రీలో కోట్లు సంపాదించారు. షూటింగ్ గ్యాప్ లో ఎన్నో పుస్తకాలను చదువుతూ ఆయన ఒక వేదాంతిగా మేధావిగా అందరికీ కనిపించేవారు. ఎదుటి వారిని ఒక్క మాట తూలనాడని అద్భుత వ్యక్తిత్వం శరత్ బాబుది.
అంతటి అద్భుత నటుడు ఇతర భాషల్లో ఉండి ఉంటే పద్మ పురస్కారాలు వరించి వచ్చేవి. కానీ ఆయన తెలుగు వాడు కావడమే ఆయన బ్యాడ్ లక్ అని అనే వారు ఉన్నారు. ఏది ఏమైనా ఈ లేత బుగ్గల అందగాడు ఈ రోజు భువి నుంచి దివికేగి పోయారు. ఆయన నటించిన చిత్రాలు పాత్రలు మాత్రం కళ్ళకు కట్టేసి అందులో చిరంజీవిగా మిగిలిపోయారు.