వారితో గొడవ పడ్డాను : విజయ్ దేవరకొండ

దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగవంశీ నిర్మించిన ‘లక్కీ భాస్కర్‌’ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీపావళి సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అంటూ మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను నిర్వహించారు. సినిమాకు త్రివిక్రమ్‌ భార్య సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దాంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో త్రివిక్రమ్‌ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. త్రివిక్రమ్‌ తో పాటు రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ సైతం ముఖ్య అతిథిగా హాజరు అవ్వడం జరిగింది.

సినిమాపై త్రివిక్రమ్‌ చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. సినిమా కథ గురించి తనకు తెలుసని, ఒక మంచి సినిమాగా లక్కీ భాస్కర్‌ నిలుస్తుందనే విశ్వాసంను ఆయన వ్యక్తం చేశారు. దుల్కర్‌ వంటి ఒక మంచి నటుడు తెలుగులో సినిమాలు చేయడం సంతోషం అన్నట్లుగా త్రివిక్రమ్‌ కామెంట్స్ చేశారు. ఇక విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుల్కర్ సల్మాన్‌ తో ఒక మల్టీస్టారర్ సినిమాకు సంబంధించిన చర్చలు జరిగాయని అన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కార్యరూపం దాల్చలేదని తెలుస్తోంది. భవిష్యత్తులో మళ్లీ కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా దుల్కర్‌ తో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

ఇంకా విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ తనకు అత్యంత ఇష్టమైన దర్శకుల్లో త్రివిక్రమ్‌ ముందు ఉంటారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలను చూస్తాను. ముఖ్యంగా ఆయన దర్శకత్వంలో వచ్చిన ఖలేజా సినిమా అంటే తనకు చాలా ఇష్టం అన్నాడు. ఖలేజా సినిమాను అప్పట్లో ఎవరైనా బాగాలేదని అంటే వారితో గొడవ పడేవాడిని. ఖలేజా సినిమా గొప్పతనం గురించి, ఆ సినిమా పాయింట్స్ గురించి ఇతరులకు వివరిస్తూ ఉండేవాడిని. ఖలేజా గురించి ఎవరు విమర్శించినా తట్టుకోలేక పోయేవాడిని అన్నాడు. ఖలేజా సినిమా పై తనకు ఉన్న ప్రత్యేక అభిమానంను విజయ్‌ దేవరకొండ చెప్పడంతో ఆ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మహేష్ బాబు ఫ్యాన్స్‌తో పాటు చాలా మంది సైతం విజయ్‌ దేవరకొండ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు. అప్పుడు ఖలేజా సినిమా నిరాశ పరచినా ఆ తర్వాత రోజుల్లో టీవీల్లో టెలికాస్ట్‌ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. వసూళ్ల విషయంలో తీవ్రంగా నిరాశ పరిచిన ఖలేజా సినిమా ఆ తర్వాత రోజుల్లో మహేష్ బాబు, త్రివిక్రమ్‌కి మంచి పేరును తెచ్చి పెట్టింది. ఇటీవల మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో గుంటూరు కారం సినిమా వచ్చింది. ఆ సినిమా సైతం కమర్షియల్‌గా నిరాశ పరచినా ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఒక భారీ సినిమాను చేస్తున్నారు. త్వరలోనే ఆ సినిమా టైటిల్‌ ను ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారు. లక్కీ భాస్కర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ లుక్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది.