ఒక సాధారణ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రాఘవ లారెన్స్ నటుడిగా, దర్శకుడిగా మంచి మార్కులు దక్కించుకున్న విషయం తెల్సిందే. ఇతడు హీరో ఏంటి అన్న వారికి తన సూపర్ హిట్ సినిమాలతో సమాధానం ఇచ్చాడు. డాన్స్ మాస్టర్ డైరెక్షన్ ఏం చేస్తాడు అంటూ పెదవి విరిచిన వారికి తన సినిమాలతో క్లారిటీ ఇచ్చాడు.
ఈ మధ్య కాలంలో కొరియోగ్రఫీ మరియు డైరెక్షన్ పై ఫోకస్ పెట్టకుండా పూర్తిగా నటనపై శ్రద్ద పెట్టాడు. హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల చంద్రముఖి 2 సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లారెన్స్ ఆ సినిమా ఫలితం తో సంబంధం లేకుండా మరో కొత్త సినిమాతో బాక్సాఫీస్ వద్దకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.
జిగర్‌తండ డబుల్ ఎక్స్ సినిమా తో తమిళ్ మరియు తెలుగు లో సందడి చేయబోతున్న లారెన్స్ ప్రమోషన్స్ తో హోరెత్తిస్తున్నాడు. తెలుగు లో ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసే విధంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో లారెన్స్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం నటుడిగా నేను బిజీగా ఉన్నాను. తప్పకుండా భవిష్యత్తులో మళ్లీ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. తాను దర్శకత్వం వహించేందుకు సిద్ధం అయిన సమయంలో చిరంజీవి, నాగార్జున, రజినీకాంత్ లతో సినిమాలు చేస్తానంటూ లారెన్స్ ప్రకటించారు. వారికి తగ్గ కథలను తాను రెడీ చేసి పెట్టాను అన్నాడు.
సీనియర్ మోస్ట్ హీరోల కోసం కథ లు రెడీ చేసి పెట్టుకుని రాఘవ లారెన్స్ వారితో ఎప్పుడు సినిమాలు చేసేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. గతంలో ఆ ముగ్గురు కూడా లారెన్స్ తో కలిసి వర్క్ చేసేందుకు ఆసక్తి చూపించారు. కానీ లారెన్స్ ప్రస్తుతం హీరోగా ఉండటం వల్ల దర్శకత్వం పై ఎక్కువ ఫోకస్ పెట్టడం లేదు.