బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెల్సిందే. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించడంతో పాటు పలు చిత్రాల్లో నటుడిగా నటించడంతో పాటు దర్శకుడిగా కూడా పలు సినిమాలను రూపొందించిన నితిన్ దేశాయ్ మరణంతో ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం అయింది.
నితిన్ దేశాయ్ అప్పుల కారణంగా మరణించాడు అంటూ ఆయన సెల్ఫీ వీడియోల ద్వారా వెల్లడి అయింది. దాంతో ఆయన గురించి మీడియాలో రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. నితిన్ దేశాయ్ చాలా మందిని ఆర్థికంగా మోసం చేసి చనిపోయాడు అంటూ కొందరు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు.
తండ్రి మరణం.. ఆపై వస్తున్న విమర్శలపై నితిన్ దేశాయ్ కుమార్తె మాన్సీ తీవ్రంగా స్పందించారు. ఆమె మాట్లాడుతూ… ఒక ఫైనాన్స్ కంపెనీ నుంచి మా నాన్న రూ.181 కోట్లు అప్పుగా తీసుకున్నారు.
ఇప్పటికే ఆ మొత్తంలో సగానికి పైగా చెల్లించారు. అయితే 2020 నుంచి కరోనా వల్ల స్టూడియో మూత పడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డబ్బు చెల్లించడంలో ఇబ్బందులు ఉన్నట్లుగా సదరు కంపెనీ కి నాన్న చెబుతూ వచ్చారు. అయితే కొన్ని నెలల క్రితం ఆరు నెలల వడ్డీ ని చెల్లించాల్సిందే అంటూ వారు కోరడంతో పొవాయిలో ఉన్న ఆఫీస్ ను అమ్మేసి ఆ డబ్బులు చెల్లించారు.
మిగిలిన డబ్బు ను కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. అంతే తప్ప ఎవరిని కూడా నాన్న మోసం చేయలేదు. కాబట్టి ఆయన పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. మీడియాలో ఇష్టానుసారంగా కథనాలు రాస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.