విరాట్ కొహ్లీ పేరు రాహుల్ గా మార్చారు… ఎందుకో తెలుసా?

సరిగ్గా ఆరేళ్ల క్రితం.. ఇదే రోజున (డిసెంబర్ 11) టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి – బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇటలీలోని టస్కనీ వేదికగా “విరుష్క” వివాహం అత్యంత సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు వారి పెళ్లిరోజు కావడంతో నాటి ఆసక్తికర విషయాలను అనుష్క శర్మ పంచుకుంది.

అవును… కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రుల ఆశీర్వాదాలతో డిసెంబరు 11న విరాట్‌ – అనుష్క ఒక్కటయ్యారు. 2013లో ఒక షాంపూ యాడ్‌ షూట్ సమయంలో పరిచయమైన వీరిద్దరు.. చాన్నాళ్ల పాటు ప్రేమలో మునిగితేలారు. అనంతరం అత్యంత రహస్యంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ విషయం గురించి అనుష్క శర్మ గతంలో వోగ్‌ తో మాట్లాడుతూ.. కేవలం 42 మంది అతిథుల సమక్షంలో విరాట్‌ – తాను ఒక్కటయినట్లు తెలిపింది.

ఇదే సమయంలో… విరాట్‌ కోహ్లికి ఉన్న క్రేజ్‌ దృష్ట్యా తమ పెళ్లి వార్త లీక్‌ కాకుండా నకిలీ పేరు వాడినట్లు అనుష్క వెల్లడించింది. ఇందులో భాగంగా.. కేటరర్‌ విషయంలో విరాట్‌ పేరు బయటికి రాకుండా అతడికి “రాహుల్‌” అనే నకిలీ పేరును వాడినట్లు అనుష్క వెల్లడించింది. ప్రేమతో రెండు మనసులు ఏకమయ్యే వేడుకకు పబ్లిసిటీ అవసరం లేదని భావించే అలాంటి ప్లాన్స్ చేసినట్లు అనుష్క శర్మ తెలిపింది.

పైగా అప్పటికే టీమిండియా కెప్టెన్ గా కోహ్లి – బాలీవుడ్ నటిగా అనుష్క శర్మ తమ కెరీర్‌ లో తారస్థాయిలో ఉన్నారు. దీంతో తమ పెళ్లి తమకు పర్సనల్ ఈవెంట్ గా మిగలాలి తప్ప.. మీడియాలో న్యూస్ గా కాదని భావించిన అనుష్క… హోం స్టైల్‌ వెడ్డింగ్‌ చేసుకోవాలని భావించినట్లు తెలిపారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితులు కలిసి కేవలం 42 మంది మాత్రమే ఆ కార్యక్రమంలో ఉన్నట్లు తెలిపారు.

ఇక వారి వివాహం విషయంలోనే కాదు.. వారి కుమార్తె విషయంలోనూ విరాట్ – అనుష్క ఇలాంటి జాగ్రత్తలే తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా… ఇంతవరకు ఆమె ఫేస్‌ ను రివీల్‌ చేయకుండా… పబ్లిసిటీకి దూరంగా, సాధారణ అమ్మాయిలా తమ కుమార్తెను పెంచాలనే ఉద్దేశంతోనే మీడియాకు దూరంగా ఉంచుతున్నట్లు విరుష్క జోడీ వెల్లడించింది. ఈ జంటకు 2021, జనవరి 11న కూతురు జన్మించగా.. ఆమెకు వామికా కోహ్లిగా నామకరణం చేశారు.

ఇక విరాట్ విషయానికొస్తే… ఈ వరల్డ్ కప్ లో తన కెరీర్ లో 50వ సెంచరీ చేసిన కొహ్లీ రికార్డుల రారాజుగా నిలిచాడు. వన్డే వరల్డ్‌ కప్‌-2023 టాప్‌ స్కోరర్‌ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా డిసెంబరు 26న కొహ్లీ మరోసారి మైదానంలో దిగే అవకాశం ఉంది.