తమ మధ్య ఏమీ లేదు అంటూనే చివరికి పెళ్లి శుభలేఖ అచ్చేయిస్తున్నారు యువజంటలు. అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ.. కాజల్ – గౌతమ్ కిచ్లు.. నుంచి, మొన్న పెళ్లయిన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వరకూ ప్రేమాయణాలు అన్నీ ఇదే బాపతు. సడెన్ గా నిశ్చితార్థం – పెళ్లి అంటూ ట్విస్టిచ్చినవారే వీరంతా. చివరివరకూ దాగుడుమూతలు ఆడేస్తూ వ్యవహారాన్ని నడిపించేస్తున్నారు నేటితరం తారలు.
అందుకే ఇప్పుడు వైష్ణవ్ తేజ్- రీతూ వర్మ జంటపై పుకార్లు ఆగడం లేదు. వైష్ణవ్ తేజ్ చెబుతున్నది కూడా ఎవరూ వినడం లేదు. ఈ జంట కూడా ఇదే బాపతు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. చాలా కాలంగా ఈ జంట గుట్టుగా ప్రేమాయణం సాగిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంటతో పోలుస్తున్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి జంట వివాహం ఇటీవల ఇటలీలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహానికి సంబంధించిన ప్రీవెడ్డింగ్ వేడుకల్లో వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు యువకథానాయిక రీతూ వర్మ కూడా పాల్గొన్నారు. పెళ్లికి ముందు అల్లు అర్జున్ ఇచ్చిన పార్టీలో రీతూ వర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిపై పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ఆ కుటుంబానికి చెందిన ఓ హీరోతో ఆమె రిలేషన్ షిప్ లో ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది.
ఇప్పుడు `ఆదికేశవ` సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న వైష్ణవ్ తేజ్ ఆయా కథనాలపై స్పందించారు. వరుణ్-లావణ్యల వివాహ వేడుకలో రీతూ వర్మ పాల్గొనడానికి గల కారణం వెల్లడించారు. లావణ్య త్రిపాఠికి రీతూ మంచి స్నేహితురాలని.. అందుకే పెళ్లి వేడుకలో సందడి చేసిందని అతడు తెలిపాడు. అంతకు మించి ఏమీ లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇదే ఇంటర్వ్యూలో వైష్ణవ్ తేజ్ పలు ఆసక్తికర విషయాలను ముచ్చటించాడు. తన మావయ్యలు నటించిన ఖైదీ-బద్రి సినిమాల రీమేక్‌లో నటించాలనుకుంటున్నట్లు చెప్పారు
ఇక సినిమాల విషయానికి వస్తే.. వైష్ణవ్ తేజ్ తాజా చిత్రం ఆదికేశవ త్వరలో విడుదల కానుంది. ఇది అతనికి 4వ సినిమా. ఇందులో రుద్ర కాళేశ్వర్ రెడ్డిగా వైష్ణవ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడు. శ్రీలీల కథానాయిక. మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణా దాస్, రాధిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ సినిమా నవంబర్ 24న విడుదల కానుంది.