సమంత హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ గా ఉంది. ఏప్రిల్ 14వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా దర్శకుడు గుణశేఖర్ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించారు. ముఖ్యంగా సినిమాలోని బంగారు ఆభరణాల గురించి షాకింగ్ విషయాలు వెళ్లడించారు.
శాకుంతలం సినిమా కోసం దాదాపు 14 కోట్ల రూపాయల విలువైన నిజమైన బంగారు మరియు వజ్రాల ఆభరణాలు దర్శకుడు గుణశేఖర్ చేయించాడట. గతంలో దాన వీర శూర కర్ణ సినిమాలో నిజమైన బంగారు ఆభరణాలు వాడారనే విషయం తెల్సిందే. ఆ స్ఫూర్తితోనే ఈ సినిమా కోసం కూడా నిజమైన బంగారు ఆభరణాలు చేయించినట్లుగా దర్శకుడు పేర్కొన్నాడు.
ఈ మొత్తం ఆభరణాలను వసుంధర జ్యువెలరీ నుండి తెప్పించారట. ప్రముఖ డిజైనర్ నీతు లుల్లా వీటిని డిజైన్ చేయడం జరిగిందట. సమంత పోషించిన శాకుంతలం పాత్ర కోసం సుమారుగా 15 కేజీల బంగారాన్ని ఉపయోగించి 14 రకాల ఆభరణాలను చేయించారట. ఇక దుష్యంత మహారాజు పాత్ర కోసం దాదాపు 10 కేజీల బంగారు ఆభరణాలను చేయించినట్లుగా యూనిట్ సభ్యులు తెలియజేశారు.
భారీ మొత్తంలో దర్శకుడు గుణశేఖర్ సెట్స్ కోసం ఖర్చు చేస్తూ ఉంటాడు. కానీ ఈసారి మాత్రం బంగారం కోసం అధికంగా ఖర్చు చేసినట్లుగా ఉన్నాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇంతగా నిజమైన బంగారం అవసరమా అంటూ ప్రశ్నించే వారు ఉండగా.. గుణశేఖర్ యొక్క పట్టుదలను అభినందించే వారు కూడా చాలా మంది ఉన్నారు.
దిల్ రాజు సమర్పిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. ఎంతో మంది ప్రముఖ నటి నటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్.. స్నేహా రెడ్డి యొక్క కూతురు అల్లు అర్హ కూడా ఈ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ లో కనిపించబోతున్న విషయం తెల్సిందే.