షాకింగ్ రోల్‌ కి కమిట్‌ అయిన సీనియర్‌ హీరోయిన్‌

70కి పైగా సినిమాల్లో నటించి, సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై తనదైన ముద్ర వేసే విధంగా నటిస్తూ ఏకంగా 17 సార్లు ఫిల్మ్‌ ఫేర్ అవార్డులకు నామినేట్ అయ్యి, ఆరు ఫిల్మ్‌ ఫేర్ అవార్డునులను సొంతం చేసుకున్న సీనియర్‌ హీరోయిన్ మాధురీ దీక్షిత్‌. అందం, డాన్స్, నటన ఇలా ప్రతి విషయంలో కూడా ఒకానొకప్పుడు స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకున్న మాధురీ దీక్షిత్ ఇప్పటికి కూడా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే ఉంది.

ఈ మధ్య సినిమాల సంఖ్య కాస్త తగ్గించి కూడా బుల్లి తెర ద్వారా రెగ్యులర్‌ గా కనిపిస్తున్న మాధురీ దీక్షిత్‌ వెబ్‌ సిరీస్‌ లతో కూడా ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధం అయ్యింది. ఇప్పటికే ఈమె వెబ్‌ సిరీస్ ల్లో నటించేందుకు రెండు మూడు కథలు విన్నట్లుగా బాలీవుడ్‌ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ఈ సీనియర్‌ నటి ఛాలెంజింగ్‌ రోల్‌ ను చేసేందుకు కమిట్‌ అయ్యింది. నగేష్ కుకునూన్‌ దర్శకత్వంలో ‘మిసెస్‌ దేశ్‌పాండే’ అనే థ్రిల్లర్ వెబ్‌ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. బాలీవుడ్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వెబ్‌ సిరీస్ లో మాధురీ సీరియల్‌ కిల్లర్ గా కనిపించబోతుందట. సాధారణంగా సీరియల్‌ కిల్లర్స్ గా ఎక్కువ మగవారు నటిస్తారు. కానీ ఈ వెబ్‌ సిరీస్ లో మాత్రం మాధురీ దీక్షిత్‌ తో ఆ పాత్ర చేయిస్తున్నారని సమాచారం అందుతోంది.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ తో పాటు పాన్‌ ఇండియా స్థాయి లో ప్రేక్షకులను తనదైన శైలి సినిమాలతో అలరిస్తున్న దర్శకుడు నగేష్‌ కుకునూర్‌. తెలుగు సినిమాలకు కూడా గతంలో దర్శకత్వం వహించిన నగేష్ కుకునూర్‌ ఇప్పుడు బాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నాడు. ఆయన చెప్పిన కథ నచ్చడంతో మాధురీ దీక్షిత్‌ షాకింగ్‌ రోల్‌ సీరియల్‌ కిల్లర్ పాత్రలో నటించేందుకు ఓకే చెప్పిందట.

వెబ్‌ సిరీస్ కథ విషయానికి వస్తే… ఒక సీరియల్‌ కిల్లర్ ను పట్టుకోవడం కోసం పోలీసులు ఒక పాత సీరియల్‌ కిల్లర్‌ ను అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఆ సీరియల్‌ కిల్లర్ ను పాత సీరియల్‌ కిల్లర్‌ ఎలా పట్టుకున్నారు అనే కథాంశంతో ఈ వెబ్‌ సిరీస్‌ కథ సాగుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సిరీస్‌ లోని థ్రిల్లర్ ఎలిమెంగట్స్ ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేస్తాయని అంటున్నారు. మోడరన్‌ లవ్‌ హైదరాబాద్‌ తర్వాత గ్యాప్‌ తీసుకున్న దర్శకుడు నగేష్ కుకునూన్‌ చాలా రోజుల తర్వాత మళ్లీ ఓటీటీ కంటెంట్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సిరీస్‌ లో మాధురీ దీక్షిత్ నటించేందుకు ఒప్పుకోవడంతోనే నగేష్ సగం సక్సెస్ దక్కించుకున్నట్లు అయ్యిందని, ఆయన ఈ కథను చక్కగా చూపించగలిగితే అద్భుతమైన వెబ్‌ సిరీస్ రావడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.