ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న వెబ్ సిరీస్ పేరు సిటాడెల్. ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే ఇంగ్లీష్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన సిటాడెల్ ఇంగ్లీష్ వర్షన్ కి మంచి స్పందన వచ్చింది. అంతే కాకుండా హాలీవుడ్ ప్రేక్షకులు నీరాజనాలు పడుతూ ఉన్నారు.
మరో వైపు సిటాడెల్ హిందీ వర్షన్ కూడా సిద్ధం అవుతోంది. వరుణ్ దావన్ మరియు సమంత ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు రాజ్ అండ్ డీ దర్శక ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సిరీస్ కు సంబంధించిన చివరి దశ షూటింగ్ ను నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇక సిటాడెల్ ఇంగ్లీష్ వర్షన్ 5వ ఎపిసోడ్ లో ప్రియాంక చోప్రా యొక్క తండ్రి పాత్రకు డబ్బింగ్ చెప్పడం జరిగింది. అంటే సిటాడెల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా తండ్రి వరుణ్ దావన్ అని క్లారిటీ వచ్చింది. ఇక సమంత కూతురు ప్రియాంక చోప్రా అనే విషయం దీన్ని బట్టి అర్థం అవుతుంది.
ఇన్నాళ్లు చాలా మంది ఇంగ్లీష్ సిటాడెల్ కు రీమేక్ గా హిందీ సిటాడెల్ రూపొందుతోంది అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటి అంటే ఇంగ్లీష్ సిటాడెల్ కు ప్రీక్వెల్ గా హిందీ సిటాడెల్ రూపొందుతోంది.
అందుకే హిందీ సిటాడెల్ 1990 కాలం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. కాస్త విభిన్నంగా అనిపిస్తున్నప్పటికి ప్రేక్షకులకు హిందీ సిటాడెల్ వస్తే మొత్తం క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.