ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 1 ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ట్రెండ్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసింది. ముఖ్యంగా హిందీ, ఓవర్సీస్ లో అయితే పుష్పకి ఎవ్వరూ ఊహించని స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. దీంతో పుష్ప సీక్వెల్ మీద అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది.
పుష్ప ది రూల్ చిత్రాన్ని మరింత గ్రాండియర్ గా సుకుమార్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అందరి అంచనాలని అందుకునే స్థాయిలోనే మూవీ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ కాబోతోంది. రెండేళ్ల నుంచి మూవీ షూటింగ్ జరుగుతోంది. సుకుమార్ అంటే పెర్ఫెక్షన్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటివారు. బెటర్ మెంట్ కోసం రిలీజ్ ముందు రోజు వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు.
పుష్ప 1 మూవీ రిలీజ్ సమయంలో కూడా అదే జరిగింది. సుకుమార్ తప్ప చిత్ర యూనిట్ అంతా ప్రమోషన్స్ పై ఫోకస్ చేస్తే అతను ఎడిటింగ్ రూమ్ లో రాత్రి పగలు అని తేడా లేకుండా కూర్చొని బెస్ట్ అవుట్ ఫుట్ తీసుకురావడానికి వర్క్ చేసేవారు. ఒక్క ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాత్రమే సుకుమార్ పాల్గొన్నారు. రిలీజ్ ముందు రోజు రాత్రి వరకు ఎడిటింగ్ రూమ్ లో మార్పులు, చేర్పులు చేస్తూనే వచ్చారు.
పుష్ప సక్సెస్ తో సుకుమార్ తాను పడిన కష్టాన్ని పూర్తిగా మరిచిపోయారు. ఇప్పుడు పుష్ప ది రూల్ విషయంలో కూడా సుకుమార్ అదే రీతిలో వర్క్ చేస్తున్నారంట. నిజానికి మే నెలలో షూటింగ్ పూర్తిచేసి మిగిలిన రెండు నెలలు పూర్తిగా ప్రమోషన్స్ మీద ఫోకస్ చేస్తారని అందరూ భావించారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న టాక్ బట్టి ఈ సినిమా షూటింగ్ జూన్ నెలాఖరుకి పూర్తయ్యే అవకాశం ఉందంట. అవుట్ ఫుట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కానీ సుకుమార్ ప్రతి సీన్ వీలైనన్ని ఎక్కువ వేరియేషన్స్ లో తీసుకుంటున్నారంట.
అందుకే షూటింగ్ ఆలస్యం అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే సుకుమార్ తో వర్క్ చేసే వారికి ఇది అలవాటైపోయిందని తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో షూటింగ్ తర్వాత సుకుమార్ ప్రమోషన్స్ కి దూరమై ఎడిటింగ్ రూమ్ కి పరిమితం అయిపోయే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. పుష్ప హిట్ తో వచ్చిన ఎక్స్ పెక్టేషన్స్ అందుకోవాలంటే మరింత పెర్ఫెక్ట్ గా వర్క్ చేయాలని సుకుమార్ భావిస్తున్నారంట. సినిమాలో పాయింట్ చేయడానికి ఆడియన్స్ కి ఎక్కడా అవకాశం ఇవ్వకూడదని డిసైడ్ అయినట్లు సమాచారం.