సూపర్ హిట్స్ ఇచ్చాడు.. ఎంతో సంపాదించాడు.. రోడ్లపై తిరుగుతున్నాడు

తెలుగు సినిమా ప్రేక్షకులకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈతరం ప్రేక్షకులకు నారాయణ మూర్తి గొప్పతనం.. ఆయన సినిమాల గురించి తెలియక పోవచ్చు కానీ 1990 కిడ్స్ కు ముందు వారు అందరు కూడా ఆర్ నారాయణ మూర్తి సినిమాలను థియేటర్ లో మరియు టీవీల్లో చూసిన వారే.

ఒకప్పుడు ఆర్ నారాయణ మూర్తి సినిమా వస్తుంది అంటే పెద్ద హీరోల సినిమాలు కూడా రిలీజ్ ను స్కిప్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఆర్ నారాయణ మూర్తి ప్రస్తుతం రోడ్ల మీద తిరుగుతూ సినిమా కార్యక్రమాలకు హాజరు అవుతూ ఉన్నాడు. ఆటోలో ప్రయాణం చేస్తూ తన పనులు చూసుకుంటూ ఉంటాడు.

తాజాగా ఆర్ నారాయణ మూర్తి గురించి ప్రముఖ ఫిల్మ్ మేకర్ తమ్మారెడ్డి భరద్వాజ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నమ్మిన సిద్దాంతం కోసం కోట్ల రూపాయలను మరియు స్టార్ డమ్ ని వదిలేసిన ఏకైక నటుడు ఆర్ నారాయణ మూర్తి. తన సినిమాలతో ప్రేక్షకులను ప్రభావితం చేసిన వారిలో ఆర్ నారాయణ మూర్తి ముందు ఉంటారు అనడంలో సందేహం లేదు.

నమ్మిన సిద్ధాంతం అనుసారంగానే సినిమాలు చేయాలని భావించాడు. ఆయన పంథా మార్చుకుని సినిమాలు చేస్తే ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించేవాడు. కానీ ఎప్పుడు కూడా ఆయన అలా చేయలేదు. స్టార్ స్టేటస్ ని వద్దనుకుని ఆయన మార్క్ సినిమాలు చేస్తూ వచ్చాడు.

మీ సిద్ధాంతం వదలకుండా మీరు సినిమాలు చేసే విధానం మార్చుకోండి అంటూ నేను చాలా సార్లు చెప్పి చూశాను. కానీ ఆయన మాత్రం వినిపించుకోలేదు. విప్లవ పంథాలోనే సినిమాలు తీయడం వల్ల ఇంకా అలాగే ఉండి పోయారు.

ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చినా.. ఎంతో సంపాదించినా కూడా ఆయన ఇప్పటికి రోడ్డు మీద నడుచుకుంటూ లేదా ఆటో లో తిరుగుతూ ఉన్నాడు. ఆయన గొప్పతనం మరెవ్వరికి రాదని తమ్మారెడ్డి అన్నారు.