దాదాపు 26 ఏళ్ల క్రితం యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్.. ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ ల తొలి కలయికలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఇండియన్’. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ మూవీని తెలుగులో ‘భారతీయుడు’ పేరుతో రిలీజ్ చేశారు. రెండు భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించిన ఈ సినిమాకు మళ్లీ ఇన్నేళ్ల తరువాత శంకర్ సీక్వెల్ ని చేస్తున్న విషయం తెలిసిందే. ‘ఇండియన్ 2’ పేరుతో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.
కాజల్ అగ్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కరోనా ప్రబలడానికి ముందు సెట్ లో జరిగిన క్రేన్ యాక్సిడెంట్ కారణంగా అర్థాంతరంగా నిలిచిపోయింది. సెట్ లో ఈ ప్రమాదం కారణంగా కొంత మంది సిబ్బంది చినిపోవడంతో శంకర్ నిర్మాత సుభాస్కరన్ ల మధ్య వివాదం తలెత్తింది.
దీంతో ఈ ప్రాజెక్ట్ ని మధ్యలోనే ఆపేసిన శంకర్ .. స్టార్ హీరో రామ్ చరణ్ తో తెలుగులో భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. అది చట్టవిరుద్ధం అంటూ చిత్ర బృందం శంకర్ పై కోర్టుని ఆశ్రయించింది.
వివాదాన్ని కోర్టు బయటే పరిష్కరించుకోవాలని కోర్టు చెప్పడంతో మళ్లీ మొదటికి వచ్చింది. తాజాగా ‘విక్రమ్’ బ్లాక్ బస్టర్ తో నాలుగేళ్ల విరామం తరువాత ట్రాక్ లోకి వచ్చిన కమల్ హాసన్ మళ్లీ ‘ఇండియన్ 2’ని పట్టాలెక్కించే ప్రయత్నాలు చేశారు. ఇదే సమయంలో యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్ ని ఈ మూవీని సహ భాగస్వామిగా చేర్చి ఎట్టకేలకు ఆగిపోయిందని భావించిన ‘ఇండియన్ 2’ని పట్టాలెక్కించాడు. ఇటీవలే తిరిగి పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మళ్లీ మొదలైంది.
గత కొంత కొన్ని నెలలుగా ఆగిపోయిన ఈ మూవీ మళ్లీ పట్టాలెక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫైనల్ గా గురువారం యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూడా సెట్ లోకి అడుగు పెట్టారు.
సెట్ లోకి స్వాగతం పలికి కమల్ కు శంకర్ సీన్ ని వివరిస్తున్న వీడియోని కమల్ సోషల్ మీడియా ఏదికగా షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. ఈ మూవీలోని కీలక పాత్రల్లో రకుల్ ప్రీత్ సింగ్ సిద్ధార్ధ్ గుల్షన్ గ్రోవర్ ప్రియా భవానీ శంకర్ సముద్రఖని బాబీ సింహా తదితరులు నటిస్తున్నారు.