తమిళ స్టార్ హీరోల్లో ఒకరు.. తెలుగు ప్రేక్షకులకు యాక్షన్ హీరోగా సుపరిచితుడు విశాల్ ఇంటిపై రాళ్ల దాడి జరిగిన ఉదంతం ఇప్పుడు కలకలాన్ని రేపుతోంది. చెన్నైలోని అన్నానగర్ లోని ఆయన నివాసంపై రెడ్ కలర్ కారులో వచ్చిన వారు.. రాళ్లు విసిరిన వైనం ఇప్పుడు చర్చగా మారింది. ఇంటిపై రాళ్లు విసిరిన గుర్తు తెలియని వ్యక్తుల కారు సీసీ కెమేరాలో రికార్డు అయ్యింది.
చెన్నైలోని అన్నానగర్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న విశాల్ ఇంటిపై రాళ్లదాడిపై పోలీసులు సైతం తీవ్రంగా పరిగణించారు. విశాల్ మేనేజనర్ హరి కృష్ణన్ అన్నానగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఉదంతం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. రాళ్లతో ఇంటిపై విసిరిన వారు.. ఆ వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ రాళ్ల దాడిలో అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్ల దాడికిసంబంధించిన వీడియో ఫుటేజ్ సీసీ టీవీ కెమేరాలో రికార్డు అయ్యాయి. ఈ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఈ ఘటన వెనుక ఎవరు ఉంటారు? అన్న అంశంపై విచారణ జరుపుతున్నారు.
నిందితుల్ని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెబుతున్నారు. రాళ్ల దాడి జరిగిన సమయంలో విశాల్ ఇంట్లో లేకపోవటం.. షూటింగ్ కోసం బయటకు వెళ్లినట్లుగా చెబుతున్నారు.
దక్షిణాది అగ్ర హీరోల్లో ఒకరుగా వెలుగొందుతున్న విశాల్.. ఒక దశలో తమిళ రాజకీయాల్లోకి సీరియస్ గా అడుగు పెట్టాలని భావించారు. కానీ..
అనుకున్నట్లుగా అది ముందుకు సాగలేదు. తమిళ సినీ పరిశ్రమ నడిగం సంఘం జనరల్ సెక్రటరీగా ఉన్న విశాల్ ఇంటిపై రాళ్లు విసిరిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. త్వరలోనే దీనికి బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఆయన నటించిన లాఠీ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.