రానా బుల్లి తెరకే పరిమితమై పోతావా?

హీరో రానా సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. బాహుబలి చిత్రంలో భళ్లాలదేవుడి పాత్రలో మెప్పించిన రానా ఆ తర్వాత వరుసగా మంచి ఆఫర్లు దక్కించుకున్నాడు. వరుసగా హీరోగా చిత్రాలు వస్తాయనుకున్నారు. కాని రానా మాత్రం చాలా తాపీగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. గత రెండేళ్ల కాలంలో రానా మీడియాలో బుల్లి తెరపై మాత్రమే తప్ప వెండి తెరపై మాత్రం కనిపించింది లేదు. అరణ్య సినిమాను విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కరోనా వచ్చింది.

కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ విధించడంతో రానా అరణ్య మరియు విరాటపర్వం చిత్రాలు వచ్చే ఏడాదిలో వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. అంటే మూడు సంవత్సరాల గ్యాప్‌ ఈయన తీసుకోనున్నాడన్నమాట. ఆ తర్వాత అయినా వరుసగా చేస్తాడా అంటే బుల్లి తెరపై టాక్‌ షోలు అని, రియాల్టీ షోలు అని ఓటీటీలో వెబ్‌ సిరీస్‌లంటూ సినిమాలను పక్కన పెడుతున్నాడు. ఇప్పటికే నెం.1 యారి విత్‌ రానా కార్యక్రమంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రానా మరో బుల్లి తెర షోకు రెడీ అవుతున్నాడు.

నెం.1 యారి షో ముగిసింది. కొత్త షోను ఇప్పటికే షూట్‌ చేశారట. మరో రెండు వారాల్లో బుల్లి తెరపై టెలికాస్ట్‌కు సిద్దం చేశారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రానా ఆ షోలో చాలా కొత్తగా కనిపించడంతో పాటు, విభిన్నమైన కాన్సెప్ట్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడట. రానా వరుసగా బుల్లి తెర షోలు చేస్తున్నాడు తప్ప సినిమాలు చేయడం లేదంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.