పవన్ కల్యాణ్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం చాలా కష్టం. తన ఆలోచనలు ఎప్పుడైనా సరే.. యూ టర్న్ తీసుకుంటుంటాయి. వాటిని దృష్టిలో ఉంచుకునే, ఆ మూడ్‌కి తగ్గట్టుగానే దర్శకులూ పనిచేయాల్సి వస్తుంటుంది. అయితే.. పవన్ ఆలోచనలు, తీసుకుంటున్న నిర్ణయాల వల్ల.. ఓ వంద కోట్ల సినిమా ఇబ్బంది పడుతోంది. దర్శక, నిర్మాతలకు కునుకు లేకుండా చేస్తోంది.
పవన్ – క్రిష్ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. అన్నీ బాగుంటే.. ఈ పాటికి సగం సినిమా పూర్తయ్యేది. కానీ కరోనా కాటుకి ఈసినిమా కూడా బలైంది. షూటింగులు మొదలెట్టినా, పవన్ ముందుగా
వకీల్ సాబ్
నే పూర్తి చేస్తాడు. ఆ తరవాతే మిగిలిన సినిమాల జోలికి వస్తాడు. వకీల్ సాబ్ పూర్తయ్యాక క్రిష్ ప్రాజెక్టు పట్టాలెక్కించాలి.
కానీ ఈలోగా పవన్ ఆలోచన మారిందని, క్రిష్ సినిమా కంటే ముందుగా హరీష్ శంకర్ సినిమాని మొదలెడతారని గాసిప్పులు మొదలయ్యాయి. దాంతో క్రిష్ బృందం డైలామాలో పడింది. పవన్ తమకే డేట్లు ఇస్తాడని క్రిష్ గట్టిగా నమ్ముతున్నాడు. నిర్మాత ఏ.ఎం.రత్నం కూడా ఈసినిమాపై బోలెడంత ఇన్వెస్ట్ చేశాడు.
ఈ యేడాది ఎలాగైనా సరే, ఈ సినిమాని పూర్తి చేయాలని భావిస్తున్నాడు క్రిష్. అయితే ఈలోగా.. పవన్ మనసు మార్చుకోవడం, క్రిష్ సినిమాని తాత్కాలికంగా పక్కన పెట్టాలనుకుంటున్నాడన్న వైనం దర్శక నిర్మాతల్లో గుబులు రేపుతున్నాయి. దాదాపు వంద కోట్ల బడ్జెట్ కేటాయించిన ప్రాజెక్టు ఇది.
ఒక్క రోజు అటూ ఇటూ అయినా లక్షల్లో నష్టాలొస్తుంటాయి. హరీష్ శంకర్ ప్రాజెక్టు కంటే… ముందు ఒప్పుకున్నది ఇదే. కొంతమేర షూటింగూ పూర్తయ్యింది. అలాంటప్పుడు క్రిష్ సినిమాని వెనక్కి నెట్టాలనుకోవడం ముమ్మాటికీ ఇబ్బంది కలిగించే నిర్ణయమే. అయితే ఈ గాసిప్పులు కావాలని పుట్టించారని, క్రిష్ సినిమా అయ్యాకే హరీష్ సినిమా ఉంటుందని మరో వర్గం వాదిస్తోంది. నిజానిజాలేంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.