నందమూరి బాలకృష్ణ సాలిడ్ సక్సెస్ దక్కించుకుని ఎన్ని సంవత్సరాలు అయ్యిందో ఆయన అభిమానులు కూడా వెంటనే చెప్పలేని పరిస్థితి. అంతటి వరుస ఫ్లాప్స్ మద్య సతమంతం అవుతున్న నందమూరి హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా సగం పూర్తి అయ్యింది. ఈ చిత్రంపై ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. తాజాగా బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా విడుదలైన బీబీ3 ఫస్ట్ రోర్ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
తక్కువ సమయంలోనే ఈ వీడియో 10 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ఎట్టకేలకు బాలయ్య నెట్టింట పాజిటివ్ వైబ్స్‌తో ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణకు ఇది మరో విజయాన్ని తెచ్చి పెట్టడం ఖాయం అని ఈ వీడియో వ్యూస్‌తోనే అర్థం అవుతుందని నందమూరి ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
బాలకృష్ణ, బోయపాటిల కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. సింహా మరియు లెజెండ్ సినిమాలు వారిద్దరి కెరీర్లో నిలిచి పోయాయి. కనుక ఇది మూడవ సినిమా అవ్వడంతో హ్యాట్రిక్ ఖాయం అంటున్నారు. బాలకృష్ణకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లెజెండ్ వంటి సాలిడ్ హిట్ ఖచ్చితంగా కావాల్సిందే. ఇక బోయపాటి కూడా గత చిత్రం వినయ విధేయ రామతో అట్టర్ ప్లాప్ చవి చూశాడు. ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసిన తర్వాత మొదలు పెట్టాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.