సూపర్ స్టార్ మహేష్ బాబు 27వ చిత్రం సర్కారు వారి పాట కు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ సమర్పిస్తోంది. నేడు మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా సర్కారు వారి పాట చిత్రం మోషన్ పోస్టర్‌ను ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ గా విడుదల చేశారు. ఇంతకు ముందే ఈ సినిమా ప్రీ లుక్ ను విడుదల చేశారు. అందులో మహేష్‌బాబు లుక్ ను రివీల్ చేయలేదు. తాజాగా మోషన్ పోస్టర్ లో కూడా మహేష్ బాబు లేకుండానే విడుదల చేశారు.
మహేష్ బాబు లేకున్నా కూడా ఈ మోషన్ పోస్టర్ ఫ్యాన్స్‌కు విపరీతంగా నచ్చేలా ఉంది. ఎందుకంటే థమన్ బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ అదిరి పోయింది. ఈ మ్యూజిక్‌ను చూస్తుంటే ఆయన పాటలతో ఏ స్థాయిలో మళ్లీ ట్రెండ్ చేయబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా బ్యాంకింగ్ రంగంపై సెటైరికల్ గా ఉంటుందని ఈ మోషన్ పోస్టర్‌తో మరోసారి చెప్పకనే చెప్పారు. రూపాయి కాయిన్ ఎగరవేస్తూ చాలా విభిన్నంగా మోషన్ పోస్టర్ ను డిజైన్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది అలాగే మెప్పించింది.
ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు కనుక ఎలాంటి అప్డేట్ ఉండక పోవచ్చు అనుకున్నారు. కాని ఫ్యాన్స్ ఆనందం కోసం ఈ మోషన్ పోస్టర్ ను మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ ఫ్యాన్స్ కు నిజంగా మహేష్ బర్త్‌డే గిఫ్ట్ మాదిరిగా అదిరిందంటూ కామెంట్స్ వస్తున్నాయి. కరోనా పరిస్థితుల నుండి బయట పడ్డ తర్వాత షూటింగ్ మొదలు అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించిన మరెలాంటి విషయాలపై అధికారిక ప్రకటన రాలేదు.