నాకు హిందీ రాదు ..ఆ బీజేపీ నేత వ్యాఖ్యలపై కనిమొళి ఫైర్ !


దేశంలో ఇప్పుడు హిందీ పై పెద్ద దుమారం రేగుతుంది. ఈ మధ్య కేంద్రం తీసుకొచ్చిన కొత్త జాతీయ విద్యా విధానం పై అనేకమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే నాకు హిందీ మాట్లాడటం వచ్చా.. రాదా.. అన్నది కాదు ఇప్పుడు సమస్య. హిందీ వస్తేనే నన్ను భారతీయురాలిగా గుర్తిస్తాననడం సిగ్గుచేటు అంటూ డీఎంకే నేత లోక్సభ ఎంపీ కనిమొళి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గతంలో హిందీ అనువాదకురాలిగా పనిచేశారని ఆ సమయంలో హిందీ రాకుండా ఎలా పనిచేశారంటూ తన గురించి వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత హెచ్ రాజా తీరు పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కేరళలోని కోళీకోడ్ ఎయిర్ పోర్టు వద్ద విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో అక్కడికి వెళ్లిన కనిమొళి కి చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సీఐఎస్ ఎఫ్ కు చెందిన ఓ మహిళా జవాను మీరు భారతీయులేనా అని తనను ప్రశ్నించినట్లు ఈ తూతుక్కుడి ఎంపీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. హిందీ భాష వ్యతిరేకోద్యమానికి నిలయమైన తమిళనాడులో ఈ విషయంపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నేత పి. చిదంబరం ఆయన కుమారుడు కార్తి చిదంబరంతో పాటు పలువురు తమిళనేతలు సీఎస్ ఐ ఎఫ్ తీరును ఖండిస్తూ కనిమొళికి మద్దతు తెలిపారు.

అయితే తమిళనాడు బీజేపీ నేత హెచ్ రాజా మాత్రం కనిమొళి ట్వీట్పై అనుమానం వ్యక్తం చేశారు. భారత ఉప ప్రధాని దేవీలాల్ తమిళనాడుకు వచ్చినపుడు ఆయన హిందీ ప్రసంగాన్ని కనిమొళి తమిళంలోకి అనువదించారు. కాబట్టి తనకు హిందీ తెలియదని చెప్పడం పచ్చి అబద్ధం అని ఎన్నికలు ఇంకా సమీపించలేదు కదా అంటూ విమర్శలు చేశారు. అయన వ్యాఖ్యలపై కనిమొళి సైతం అదే స్థాయిలో ఘాటుగా బదులిచ్చారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ నేనెవరికీ హిందీ అనువాదకురాలిగా పనిచేయలేదు. తెలియని భాషలో నేనెలా మాట్లాడగలను నా విద్యాభ్యాసం అంతా తమిళ ఆంగ్ల భాషల్లోనే సాగింది. ఢిల్లీలో ఉన్నా నాకు హిందీ రాదు. ఈ విషయం చాలా మంది రాజకీయ నాయకులకు కూడా తెలుసు అని చెప్పుకొచ్చింది.