ప్రభాస్, అల్లు అర్జున్ లతో దిల్ రాజు మెగా ప్లాన్


అగ్ర నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ లను సెట్ చేయడంలో దిట్ట. సాధ్యం కాదనుకున్న కాంబినేషన్ లను, ప్రాజెక్ట్ లను సెట్ చేసి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇవ్వడంలో దిల్ రాజు పాత్ర చాలా కీలకమని అంటుంటారు. అలాగే ప్రస్తుతం దిల్ రాజు మరో సూపర్ కాంబినేషన్ ను సెట్ చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. రెబెల్ స్టార్ ప్రభాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లతో ఒక భారీ మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిజానికి ప్రభాస్, బన్నీలు ఇద్దరూ వచ్చే రెండేళ్లు ఫుల్ బిజీ. ప్రభాస్ కు రాధే శ్యామ్, ఆది పురుష్, నాగ్ అశ్విన్ సినిమాలు ఉన్నాయి. అలాగే బన్నీ పుష్ప పూర్తి చేసిన వెంటనే కొరటాల శివతో సినిమా చేయాల్సి ఉంది. అయినా కానీ దిల్ రాజు తన ప్రయత్నాలు మానుకోవట్లేదు.

నిజానికి దిల్ రాజు దగ్గర ప్రభాస్ డేట్స్ ఉన్నాయి. అయితే ప్రభాస్ స్థాయికి తగ్గ కథను, దర్శకుడ్ని పట్టుకోవడంలో దిల్ రాజు విఫలమయ్యాడు. ఈలోగా ప్రభాస్ వరసగా రెండు సినిమాలను ఓకే చెప్పి బిజీ అయిపోయాడు. అలాగే ఐకాన్ సినిమా అటకెక్కడంతో బన్నీ డేట్స్ దిల్ రాజు వద్ద అలానే ఉన్నాయి. సో ఇద్దరి డేట్స్ ను ఒకే సినిమా కోసం ఉపయోగించుకోవాలన్నది దిల్ రాజు ప్లాన్. మరి ఇది ఎంతవరకూ సాధ్యమవుతుందో చూడాలి.