ఆన్ లైన్ గేమింగ్ అయిన రమ్మీ ఆడి ఎంతో మంది డబ్బులు కోల్పోయారు. డబ్బులు నష్టపోవడంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. పలువురు ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో రమ్మీ కోసం ప్రచారం చేసిన ప్రముఖులపై కోర్టులో ఫిర్యాదు చేయడం జరిగింది. రమ్మీ నిషేదం కేసు ను విచారణకు స్వీకరించిన కోర్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రకాష్ రాజ్, తమన్నా, రానా, సుదీప్ లకు నోటీసులు జారీ చేసింది.
పలు రాష్ట్రాల్లో ఈ గేమ్ పై నిషేదం విధించారు. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వంకు కోర్టు పలు ప్రశ్నలను సంధించింది. ఎందుకు ఈ గేమ్ ను నిషేదించడం లేదు అంటూ ప్రశ్నించారు. ఆన్ లైన్ లో జూదంను పది రోజుల్లో నిషేదిస్తుందని ఆశిస్తున్నాం అంటూ తమిళనాడు ప్రభుత్వంకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో రమ్మీకి ప్రచారకర్తలుగా వ్యవహరించిన వారిని వివరణ అడుగుతూ నోటీసులు జారీ చేయడం జరిగింది. దాంతో వారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో తెలుగు రమ్మీ వర్షన్ ప్రకటనకు రానా ప్రచారకర్తగా వ్యవహరించిన విషయం తెల్సిందే.