కరోనాతో హీరో తాత ప్రముఖ రచయిత రామచంద్రమూర్తి మృతి


హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన వరుణ్ సందేశ్ తాత గారు అయిన జీడిగుంట రామచంద్రమూర్తి కోవిడ్ తో కన్నుమూశారు. ఈయన ప్రముఖ రచయిత. హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ లో దాదాపుగా 28 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించిన రామచంద్రమూర్తి గారు ఎన్నో పుస్తకాలను రాశారు. ఆయన తనయుడు జీడిగుంట శ్రీధర్ నటుడిగా సుదీర్ఘ కాలంగా బుల్లి తెర ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డ రామచంద్ర మూర్తి హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆయన ఆరోగ్యం కరోనా వల్ల మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు. 1940లో జన్మించిన రామచంద్రమూర్తి గారు 19 ఏళ్ల వయసులోనే వరంగల్ సహకార బ్యాంక్ లో ఉద్యోగం పొందారు. ఆయన 300 కథలు 40 నాటికలు 8 నవలలు రాశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన జీడిగుంట రామచంద్రమూర్తి గారి మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూన్నారు.