ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందబోతున్న భారీ బడ్జెట్ సినిమాలో అమితాబచ్చన్ కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. అయితే సినిమాలో ఆయన కేవలం గెస్ట్ రోల్ లో కనిపిస్తాడేమో అంటూ ప్రచారం జరిగింది. కాని బిగ్ బి ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆయనకు ఏకంగా రూ.21 కోట్ల రూపాయలను పారితోషికంగా ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాదిలో ప్రారంభం కాబోతుంది. ఈ సినిమా బడ్జెట్ గురించి మొదటి నుండి మీడియాలో పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు అమితాబచ్చన్‌కు ఏకంగా 21 కోట్ల రూపాయలను ఇస్తున్నారు అంటూ వస్తున్న వార్తలు ఆ సినిమా స్థాయి ఏంటో చెప్పకనే చెబుతోంది. అమితాబచ్చన్ రెగ్యులర్ సినిమాల్లో కంటే అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్నాడు అంటే ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా ప్రాముఖ్యత ఉండే అవకాశం ఉందంటున్నారు. దాదాపుగా రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్నట్లుగా చెబుతున్నారు. కేవలం పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా పలు ప్రపంచ దేశాల్లో కూడా ఈ సినిమాను విడుదల చేస్తారని అంటున్నారు.
బిగ్ బి ఇప్పటికే తెలుగులో సైరా సినిమాలో నటించాడు. ఆ సినిమా లో అమితాబ్ గెస్ట్ గా మాత్రమే కనిపించాడు. ఇప్పుడు ఈ సినిమాలో మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఫాంటసీ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. కనుక ఇదో అద్బుత దృశ్య కావ్యంగా ఉంటుందనే నమ్మకంను ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.