గతంలో పలు సార్లు సింగర్ సునీత పెళ్లి వార్తలు వచ్చాయి. పెళ్లి వార్తలు వచ్చిన ప్రతి సారి కూడా సునీత మీడియా ముందుకు వచ్చి లేదంటే సోషల్ మీడియా వేదికగా తాను మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సునీత పెళ్లి వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈసారి సునీత పెళ్లి వార్తలు నిజమే అన్నట్లుగా ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. సునీత ఉండే అపార్ట్ మెంట్ లోనే ఉండే ఒక ఐటీ కంపెనీ యజమాని ని ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లుగా చెబుతున్నారు.
ఆ వార్తలు అవును అనేలా నేడు సునీత నిశ్చితార్ధం జరిగినట్లు సమాచారం. కరోనా కారణంగా కేవలం రెండు కుటుంబాల పెద్దలు మాత్రమే ఈ ఉదయం శుభకార్యానికి హాజరయ్యారని సమాచారం. సింగర్ సునీత వివాహం చేసుకోబోతున్న వ్యక్తికి కూడా ఇది రెండో వివాహమేనని సమాచారం. 18 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న సునీత చిన్న వయసులోనే ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. కుటుంబంకు సంబంధించిన బాధ్యతను భర్త చూసుకోక పోవడంతో తానే స్వయంగా కష్టపడి కుటుంబంను నడిపింది. కొన్ని కారణాల వల్ల భర్త నుండి విడాకులు తీసుకుని పిల్లలతో ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. పిల్లలు ఇప్పటి వరకు చిన్న వారు అవ్వడంతో ఆమెకు పెళ్లి విషయమై ఆసక్తి లేదు. కాని పిల్లలు పెద్ద వారు అవుతున్న కారణంగా ఒంటరి జీవితం గడపాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో పెళ్లికి సిద్దం అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. సునీత పెళ్లి వార్తలు ఆమె అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తాయి అనడంలో సందేహం లేదు. సునీత కొత్త జీవితంలో అడుగు పెడితే అక్కడ ఆమెకు అంతా సంతోషంగా ఉండాలని అభిమానుల తరపును మనం కోరుకుందాం.