సీఎం జగన్ కు గవర్నర్ ఫోన్.. ఏలూరు పరిస్థితిపై ఆరా..

రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న ఏలూరు వింత వ్యాధి ఘటనపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆరా తీశారు. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

ఏలూరు ప్రజల ఆరోగ్య పరిస్థితి, తీసుకుంటున్న చర్యలపై సీఎంను అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు అవసరమైతే కేంద్ర సంస్థల సహకారాన్ని తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. ఏలూరు ప్రజలకు పూర్తి భరోసా ఇవ్వాలని కూడా సూచించారు.

ఇప్పటివరకూ 467 మంది బాధితులు ఈ వింత వ్యాధి బారిన పడ్డారని.. 263 మంది కోలుకున్నారని గవర్నర్ కు సీఎం తెలిపారు. ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని.. అవసరమైన వైద్యాన్ని, సాయాన్ని అందిస్తోందని కూడా సీఎం వివరించారు. కొద్దిమందికి అత్యవసర చికిత్స అవసరమవగా వారిని వివిధ ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

జాతీయ పోషకాహార సంస్థ, ఎయిమ్స్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ సెల్యూలార్, మాలిక్యులర్ బయాలజీ సంస్థలు ఇప్పటికే వింత వ్యాధిపై అధ్యయనం చేస్తున్నాయని.. బాధితుల బ్లడ్ శాంపిల్స్ తో పాటు ఇతర శాంపిల్స్‌ను పరీక్ష చేస్తున్నాయని గవర్నర్‌కు సీఎం తెలిపారు.