‘దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయి..’ అంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో, అనధికారిక సర్వేలు షురూ అయ్యాయి. ఎవరు చేస్తున్నారో తెలియదుగానీ, కొన్ని సర్వేల ఫలితాలు మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేసేస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపైనా, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలపైనా సదరు అనధికారిక సర్వేల ఫలితాలే నిజమయ్యాయి. అసలు ఎవరు వీటిని చేస్తున్నారు.? అన్న విషయమై ఆయా రాజకీయ పార్టీలు ‘పరిశోదన’ మొదలు పెట్టేశాయి కూడా. కాగా, తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా ఓ ఆసక్తికరమైన సర్వే వెలుగులోకి వచ్చింది. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీకి గెలుపు నల్లేరు మీద నడక ఏమీ కాదట.
బీజేపీ – జనసేన కూటమికి కూడా అడ్వాంటేజ్ వుంటుందనీ, వైసీపీ ఓటు బ్యాంకుని అటు టీడీపీ, ఇటు జనసేన – బీజేపీ కూటమి బాగానే పంచుకుంటాయనీ, ఎవరు గెలిచినా చాలా తక్కువ మార్జిన్‌తో గెలుస్తారనీ, ఎడ్జ్ మాత్రం వైసీపీదేననీ ఆ సర్వే చెబుతోంది. మరోపక్క, స్థానిక ఎన్నికల విషయంలో వైసీపీకి ఏమాత్రం పరిస్థితులు అనుకూలంగా లేవట. ఈ విషయమై అధికార పార్టీకే ఓ అవగాహన వుందనీ, ఆ కారణంగానే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు వైసీపీ ససేమిరా అంటోందన్నది కొన్ని సర్వేల సారాంశం. ఇంతకీ, జమిలి ఎన్నికలు వస్తే ఏంటి పరిస్థితి.? ఇప్పటికిప్పుడు జమిలి ఎన్నికలు వస్తే, వైసీపీ.. ఏకంగా 60 సీట్లను కోల్పోవచ్చట. అయితే, టీడీపీకి పెద్దగా అడ్వాంటేజ్ వుండకపోవచ్చట. జనసేన – బీజేపీ కూటమి మాత్రం బాగా బలపడుతుందని ఓ సర్వే చెబుతోంది.
నిజమేనా.? గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు ఎలా వున్నాయి.? అంటే, ప్రభుత్వ వ్యతిరేకత అయితే గట్టిగానే కనిపిస్తోంది. సంక్షేమ పథకాల అమలు కొంత మేర బాగానే వున్నా, కింది స్థాయిలో నేతల ప్రవర్తన వైసీపీకి పెద్ద సమస్యగా మారింది. అధికారం తలకెక్కిపోయి.. వైసీపీ నేతలు అనుసరిస్తున్న దుందుడుకు వైఖరి అందరికీ కన్పిస్తూనే వుంది. అదే, వైసీపీకి ముందు ముందు పెద్ద సమస్యగా మారబోతోందన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.