మన గణతంత్ర వేడుకలకు బ్రిటన్ ప్రధాని

ఈసారి మన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రానున్నారు. ఈ మేరకు భారత్ లో ఆయన పర్యటన ఖరారైంది. ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే వేడుకలకు విదేశీ నేతను ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది జనవరి 26న జరిగే వేడుకలకు రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ.. బ్రిటన్ ప్రధాని బోరిస్ కు ఫోన్ చేసి ఆహ్వానం పలికారు.

దీంతో మన ఆహ్వానాన్ని అంగీకరించిన బోరిస్.. గణతంత్ర వేడుకలకు హాజరవుతానని వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధాని కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న కొత్త సంవత్సరంలో తొలుత భారత్ లో పర్యటించబోతున్నట్టు జాన్సన్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో మరింత పురోగతి సాధించాలని తాను, మోదీ కృత నిశ్చయంతో ఉన్నామని, ఇందుకు తన భారత పర్యటన ఉపకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

బ్రిటన్ కు భారత్ అత్యంత ముఖ్యమైన భాగస్వామిగా భారత్ ను అభివర్ణించారు. పలు కీలక అంశాల్లో రెండు దేశాలు కలసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కాగా, మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గణతంత్ర దినోత్సవానికి బ్రిటన్ నుంచి ముఖ్య అతిథిగా హాజరవుతున్న రెండో వ్యక్తి జాన్సన్ కావడం విశేషం. 1993లో అప్పటి బ్రిటన్ ప్రధాని జాన్ మేజర్.. తొలిసారిగా మన రిపబ్లిక్ వేడుకలకు హాజరయ్యారు.