ఏపీ సీఎస్ నీలం సాహ్నిని సత్కరించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ నెలఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆమెను ఘనంగా సత్కరించారు. క్యాబినెట్ సమావేశంలో భాగంగా ఆమెను సత్కరించారు. మంత్రిమండలి సభ్యులు కూడా ఆమెను సత్కరించారు. 2019 నవంబర్ 14 నుంచి ఆమె సీఎస్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1984 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన నీలం సాహ్ని ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటివరకూ పలు హోదాల్లో పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

ఆమె కెరీర్లో.. మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్‌, టెక్కలి సబ్ కలెక్టర్‌, నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌, మున్సిపల్ పరిపాలన విభాగం డిప్యూటీ సెక్రటరీ, స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీ, నల్గొండ జిల్లా కలెక్టర్‌, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి, ఎపీఐడీసీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, 2018 నుంచి కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత కార్యదర్శిగా పలు బాధ్యతలు నిర్వహించారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ ఆమె పని చేశారు.