కరోనా కారణంగా మార్చిలో మూతపడ్డ థియేటర్లను ఇటీవలే పునః ప్రారంభించారు. ప్రేక్షకులు వస్తారో రారో అనే భయంతో పెద్ద సినిమాలను విడుదల చేయడం లేదు. ఎవరో ఒకరు ముందుకు రావాలి కదా అంటూ ఇండస్ట్రీ పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతలు విజ్ఞప్తి చేస్తున్నా కూడా ఇన్ని రోజులు ఒక మోస్తరు సినిమాలు విడుదల చేయలేదు. ఎట్టకేలకు సోలో బ్రతుకే సోబెటర్ సినిమాను ఈనెల 25వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుంది అనేది పక్కన పెడితే ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు ప్రముఖులు ముందుకు వస్తున్నారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఈనెల 23న హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు. రాజమౌళి ఆర్ఆర్‌ఆర్ సినిమాతో బిజీగా ఉన్నా కూడా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొనేందుకు ఓకే చెప్పాడు. సినిమా థియేటర్లకు మళ్లీ జనాలను రప్పించే ఉద్దేశ్యంతో జక్కన్న ఇలా ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. తప్పకుండా రాజమౌళి రాకతో సినిమా క్రేజ్ పెరగడం థియేటర్లకు జనాలు క్యూ కట్టడం చేస్తారని అంతా నమ్మకంగా ఉన్నారు. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాను విడుదల చేసేందుకు ఓకే చెప్పడం నిజంగా అభినందనీయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.