యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం ఆర్‌ఆర్ఆర్ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా ఉండబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. కరోనా కారణంగా సినిమా ఆలస్యం అయ్యింది. ఆర్‌ఆర్ఆర్ మూవీ షూటింగ్ మార్చిలో పూర్తి అవ్వబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలోనే ఎన్టీఆర్ 30 ని మార్చి లేదా ఏప్రిల్ లో ప్రారంభించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.
ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయబోతున్న సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ సినిమా కోసం ముగ్గురు ముద్దుగుమ్మలను త్రివిక్రమ్ ఎంపిక చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. సాదారణంగా త్రివిక్రమ్ సినిమా అంటే ఇద్దరు హీరోయిన్స్ ఖచ్చితంగా ఉంటారు. కాని ఈసారి ఒకరు అధికంగా ముగ్గురు ఉంటున్నారు. ఈసారి సినిమా మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. ఎన్టీఆర్ 30 ని ఇదే ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ ఏడాదిలో రాకుంటే 2022 సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు అయిననూ పోయిరావలే హస్తినకు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.