కాలి నడకన తిరుపతి కొండెక్కిన యంగ్‌ హీరో

దేవుడి ముందు అందరు సమానమే. సామాన్యులకైనా, సెలబ్రిటీలకైనా ఆ పరమాత్ముడు ఒక్కడే. కానీ ఆ దేవుడిని దర్శించుకునే విషయంలో మాత్రం చాలా తేడాలున్నాయి. సామాన్యులు దేవుడిని దర్శించుకుంటే అది సర్వసాధారణం. కానీ, సెలబ్రిటీలు దేవుడి దర్శనం కోసం వెళ్తే అది విశేషం. అందులోనూ సినిమా నటులు దైవ దర్శనం చేసుకుంటే అక్కడున్నవాళ్లకు అది ఆసక్తికరం. ఇలాంటి ఆసక్తికర ఘటన బుధవారం తిరుమలలో చోటుచేసుకుంది.

యంగ్‌ హీరో నితిన్‌ కాలినడక తిరుమల వెళ్లాడు. సామాన్య భక్తుల మాదిరి నడుచుకూంటూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య షాలినితో కలిసి బుధవారం ఉదయం నితిన్ హైదరాబాద్ నుంచి తిరుపతి బయలుదేరిన నితిన్‌.. షాలిని కారులో కొండపైకి పంపించి, ఒక్కడే నడుచుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నాడు. కాగా, నితిన్ కాలి నడకన తిరుమల వెళ్తున్న వీడియోను ఒక అభిమాని ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోను రీట్వీట్ చేసిన నితిన్.. ‘‘ఓం నమో వెంకటేశాయ’’ అని రాశారు. 2.20 గంటల్లో తిరుమల మెట్లు ఎక్కి ఆ ఏడుకొండలవాడిని దర్శించుకున్నాడట. ఈ విషయాన్ని నితిన్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ యంగ్‌ హీరో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగ్‌దే’. ఈ సినిమా మార్చి 26న విడుదల కానున్నది. ఈ సినిమాతో పాటు అంధాధున్‌ తెలుగు రీమేక్‌, చంద్రశేఖర్‌ యేలేటి డైరెక్షన్‌లో ‘చెక్‌’ సినిమాల్లో నితిన్‌ నటిస్తున్నాడు.