మంత్రిగారి బడితె పూజ.. ఏపీలో పాలన అదిరిందహో!

ఓ మంత్రిగారు, ఓ మాజీ మంత్రికి ‘బడితె పూజ’ వార్నింగ్ ఇచ్చేశారు. ప్రజాస్వామ్యంలో ఓ వ్యక్తిపై ఇంకో వ్యక్తి దాడి చేస్తాననడం ఎంతవరకు సబబు.? పైగా, ఓ ప్రజా ప్రతినిథి.. అందునా బాధ్యతగల మంత్రి, ఓ మాజీ మంత్రికి ‘బడితె పూజ’ అంటూ వార్నింగ్ ఇవ్వడమంటే, అసలు ఏ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయడంలేదని అర్థం. అసలు అక్కడ ప్రజాస్వామ్యమే లేదని భావించాలేమో.!

అలా వార్నింగ్ ఇచ్చిన మంత్రి కొడాలి నాని అయితే, సదరు మంత్రిగారు బడితె పూజ చేస్తానన్నది మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి. ‘నీకు దమ్ముంటే నన్ను టచ్ చెయ్.. నేను ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా నిరసన వ్యక్తం చేస్తున్నా.. నీకు దమ్ముందో, నీ ముఖ్యమంత్రికి దమ్ముందో, నీ ప్రభుత్వానికి దమ్ముందో..’ అంటూ దేవినేని ఉమ సవాల్ విసరడం గమనార్హం. ఇప్పుడు మంత్రిగారు తన దమ్మెంతో నిరూపించుకోవాలంటే, దేవినేని ఉమకి నిజంగానే బడితె పూజ చెయ్యాలన్నమాట. ఇంతకీ, ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల పాత్ర ఏంటి.?

మామూలుగా అయితే, ఓ వ్యక్తి.. ఇంకో వ్యక్తికి వార్నింగ్ ఇస్తే.. పోలీసులు సుమోటో కింద చర్యలు తీసుకోవాలి.. ఎందుకంటే, ఇదేదో ప్రైవేటుగా జరిగిన వ్యవహారం కాదు.. మీడియా సాక్షిగా చేసిన హెచ్చరిక. కానీ, ఆంధ్రపదేశ్ పోలీసుల వ్యవహార శైలి చాలా చాలా చిత్రంగా కనిపిస్తోంది గత కొంతకాలంగా. ఓ ఎమ్మెల్యే.. ఓ పార్టీ కార్యకర్తని బండ బూతులు తిడితే, ఆ కార్యకర్త ఆ అవమానాల్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడితే, ఇంతవరకు సదరు ఎమ్మెల్యేపై కేసు కూడా పెట్టలేకపోయారు పోలీసులు. అలాంటిది, మంత్రిగారు.. ప్రతిపక్షానికి చెందిన నేతపై ‘బడితె పూజ’ వార్నింగ్ ఇస్తే, పోలీసులు పట్టించుకుంటారా.?

బస్తీ మే సవాల్.. అంటూ సదరు మాజీ మంత్రి ఆందోళనకు సిద్ధమైన నేపథ్యంలో, దాన్ని అడ్డుకోవడానికి మాత్రం పోలీసులు మోహరించేస్తారు. ఇదీ ఆంధ్రపదేశ్‌లో పోలీసు వ్యవస్థ తీరు. ఇక్కడ మేటర్ క్లియర్. అధికార పార్టీ – ప్రతిపక్ష పార్టీ ఓ ఖచ్చితమైన అవగాహనతో రాజకీయాలు చేస్తున్నాయి. ఒకరి మీద ఒకరు సవాళ్ళు విసురుకోవడం ద్వారా ప్రజా సమస్యలు చర్చకురాకుండా చేయగలుగుతున్నాయి అధికార వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ. ‘పోరంబోకు మంత్రి.. బూతుల మంత్రి..’ అంటూ మీడియాకెక్కి గగ్గోలు పెట్టడమెందుకు.? దేవినేని ఉమ స్వయంగా కేసు బనాయించొచ్చు కదా.. మంత్రిగారి బడితెపూజ హెచ్చరికలపై.!