శశికళ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన సూపర్ స్టార్

ఇటీవలే తమిళనాడుకు చేరుకున్న ఏఐఏడిఎంకే బహిష్కృత నేత, చిన్నమ్మగా పిలవబడే శశికళ ఆరోగ్య పరిస్థితిపై సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏఎంఎంకే డెప్యూటీ జనరల్, శశికళ సమీప బంధువు అయిన టిటివి దినకరన్ వెల్లడించారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ తనకు ఫోన్ చేసారని ఆయన వెల్లడించారు. చిన్నమ్మ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. సుదీర్ఘ ప్రయాణం చేసి ఆమె తమిళనాడు చేరుకున్నారు అని దినకరన్ మీడియాకు వెల్లడించారు.

కరోనా బారిన పడిన శశికళ ఇటీవలే కోలుకుని తమిళనాడుకు రోడ్డు మార్గంలో 23 గంటలు ప్రయాణించి చేరుకున్న విషయం తెల్సిందే. అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శశికళ నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవించి జనవరిలో విడుదలయ్యారు. అనంతరం కోవిద్ బారిన పడిన ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక బెంగళూరులోనే విశ్రాంతి తీసుకుని ఇప్పుడు తమిళనాడుకు చేరుకున్నారు.