అభిజీత్‌ను దాటేసిన అఖిల్‌..

గ‌తేడాది ప్ర‌సార‌మైన బుల్లితెర బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4 టైటిల్‌ని అభిజీత్ సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు (ముగ్గురు వైల్డ్‌కార్డ్ స‌హా) ఈ సీజ‌న్‌లో పాల్గొన‌గా.. అంద‌రూ ఊహించిన‌ట్లుగానే అభిజీత్ టైటిల్‌ని గెలుచుకోగా అఖిల్‌ సార్థక్‌ రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్‌ షో ముగిసి రెండు నెలలు పూర్తి కావస్తున్నా ఏదో ఒక విషయంలో రోజూ వార్తల్లో నానుతూనే ఉంది. ఓవైపు ప్రేక్షకులకు వినోదం పంచుతూనే మరోవైపు ఇందులో పాల్గొంటున్న వారికి మంచి ఆఫర్లు తెచ్చిపెడుతోంది. ఇంతకు ముందు సీజన్‌లలో కంటే బిగ్‌బాస్4లో పాల్గొన్న వారు మాత్రం ఈ షో ద్వారా లభించిన ఫేమ్‌ను బాగా ఉపయోగించుకుంటున్నారు.

ఇప్పటికే చాలా మంది సినిమా అవకాశాలతోపాటు పలు బుల్లితెర కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్స్‌ సొంతం చేసుకున్నారు. వీరిలో వ్యక్తిక్తంతో అందరికంటే ఎక్కువ పాపులారీటిని సొంతం చేసుకున్న సోహైల్‌ ఓ సినిమాను కమిట్‌ అయిన విషయం తెలిసిందే. సోహైల్‌ మెయిన్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. ఇక మోనాల్‌ గజ్జర్‌ ఇప్పటికే అల్లుడు అదుర్స్‌లో ప్రత్యేక పాటలో మెరిసింది. మరో చిత్రంతో కూడా చర్చలు జరుపుతోంది. ఇక దేత్తడి హారిక రెండు సినిమాలను ఓకే చేసింది. దివి సినిమాల్లో నటిస్తోంది. కమెడీయన్‌ అవినాష్‌ ఓ టీవీ ఛానల్‌లో కామెడీ షో చేస్తున్నారు. ఇప్పుడు అఖిల్ సార్థక్ హీరోగా లాంచ్ అవుతున్నాడు. బిగ్‌బాస్‌లో తన లవ్‌ పెయిర్‌ మోనాల్ గజ్జర్‌తో కలిసి వెబ్‌ సిరీస్‌లోనటిస్తున్నారు. చిత్రానికి భాస్కర్ బంతుపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఇంత మంది బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు అనేక ఛాన్స్‌లు కొట్టేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకే ప్రయత్నం చేస్తుంటే బిగ్‌బాస్‌ విన్నర్‌ నుంచి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. విన్నర్‌గా అబిజీత్‌ పేరు ప్రకటించడంంతో వెంటనే ఆయన ఇంటికి వరుసపెట్టి చిత్రనిర్మాతలు క్యూ కట్టారు. దీంతో అభిజీత్‌ ఇక మీద సినిమాల్లో దూసుకుపోవడం ఖాయమని అందరూ భావించారు. కానీ అభి మాత్రం ఇప్పటికీ ఇంకా ఏ సినిమానూ ఒప్పుకోలేదు. అయితే స్టోరీల పరంగా మంచి వాటి కోసం ఎదురు చూస్తున్నాని.. సింహం లేట్‌గా వచ్చిన లేటెస్ట్‌గా వస్తుందని అభిజీత్‌ ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.