గుంటూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్రను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికలపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే మున్సిపోల్స్ లో ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశంపై అందరి అభిప్రాయాలు స్వీకరించారు. అనంతరం గుంటూరు మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి పేరు ఖరారు చేసినట్టు ప్రకటించారు. అలాగే డివిజన్ల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థులపైనా చర్చించారు. ఇప్పటికే ఆయా డివిజన్లలో పలువురు నామినేషన్లు వేశారు. వారితో మాట్లాడి అభ్యర్థిత్వాల ఖరారుపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

ఇప్పటికే పోటీలో ఉన్న పలువురు తమకే అభ్యర్థిత్వం వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. అలాంటివారి విషయంలో ఎంపీ గల్లా జయదేవ్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు. అభ్యర్థుల ఖరారు పూర్తయిన వెంటనే బీ ఫారాలు అందజేస్తారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు వంటి అంశాలతో ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరగ్గా.. రెండు సార్లు మేయర్ పీఠం టీడీపీయే దక్కించుకుంది. ఈసారి కూడా గుంటూరు కార్పొరేషన్ పై టీడీపీ జెండా ఎగరవేయాలనే పట్టుదలతో టీడీపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి.