‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కు స్టార్‌ ఇండియా బిగ్‌ ఆఫర్‌

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్‌ఆర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా బిజినెస్‌ వ్యవహారాలు మొదలు అయ్యాయి. ఇప్పటికే థియేట్రికల్‌ రైట్స్ మరియు డబ్బింగ్ రైట్స్ ను వందల కోట్లకు అమ్మేసిన చిత్ర యూనిట్‌ సభ్యులు ఇప్పుడు డిజిటల్ మరియు శాటిలైట్‌ రైట్స్ విషయమై చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్‌ సినిమా ను స్టార్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్ ఇండియా సంస్థ వారు ఏకంగా రూ.200 కోట్లకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారట.

అన్ని భాషల శాటిలైట్‌ రైట్స్ మరియు ఓటీటీ రైట్స్‌ కు గాను ఈ మొత్తంను స్టార్‌ ఇండియా ఆఫర్‌ చేశారట. అయితే విడి విడిగా అమ్మడం వల్ల ఎక్కువ మొత్తం వచ్చే అవకాశం ఉందని చిత్ర యూనిట్‌ సభ్యులు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. స్టార్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ సంస్థ వారు ఈ సినిమా కు ఇచ్చిన ఆఫర్‌ ఖచ్చితంగా భారీ ఆఫర్‌ అనవచ్చు. కాని జక్కన్న సినిమాకు ఇది సాదారణమే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. మొత్తంగా ఈ సినిమా 600 కోట్ల బిజినెస్ చేస్తుందేమో అంటూ అంతా ఆసక్తిగా ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారు.