అభిమాన హీరోను చూడాలనే ఆరాటం ఆ అభిమాని ఊపిరి తీసింది. మెగాస్టార్ చిరంజీవిని చూడాలనే తాపత్రయంలో జరిగిన తొక్కిసలాటలో ఓ అభిమాని మృతి చెందడం తీవ్ర విషాదం నింపుతోంది. ఖమ్మంలో జరిగిన శ్రీకారం ప్రీరిలీజ్ ఈవెంట్ లో జరిగిందీ దుర్ఘటన. వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం జిల్లాలోని మమత మెడికల్ కాలేజీ ప్రాంగణంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన శ్రీకారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ ఫంక్షన్ కు చిరంజీవి రావడంతో అభిమానులు, జనాలు భారీగా హాజరయ్యారు. ముఖ్యంగా చిరంజీవిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో ఆ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో శివ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న శివ బుధవారం మరణించాడు. స్థానిక ప్రకాష్ నగర్ లో శివ వంటమాస్టార్‌గా పని చేస్తున్నాడు. శివ మృతి అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.