‘వద్దు మొర్రో..’ అని అనుకుంటున్నాసరే యంగ్ టైగర్ జూనియర్ నందమూరి తారకరామారావు (జూ. ఎన్టీయార్) పొలిటికల్ ఒత్తడిని దూరం చేసుకోలేకపోతున్నాడు. తాజాగా ఎన్టీయార్ ముందు ‘రాజకీయ రంగ ప్రవేశమెప్పుడు.?’ అన్న ప్రశ్న వచ్చిపడింది. చాలా క్యాజువల్‌గా ఆ ప్రశ్నను తనదైన సమాధానంతో తిప్పికొట్టాడు జూ.ఎన్టీయార్. ‘సమయం కాదు, సందర్భం కాదు’ అని లైట్ తీసుకున్నాడుగానీ, ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?’ అని అభిమానులు, అందునా కొందరు టీడీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన సినీ నటుడ్ని ప్రశ్నిస్తున్నారు.
సినిమా వేరు, రాజకీయం వేరు. అలాగని సినిమా నటులు రాజకీయాలు చేయకూడదని కాదు. రాత్రికి రాత్రి సినీ నటుల ‘పరువు’ బజార్న పడిపోతుంది రాజకీయాల కారణంగా. సినిమా స్టార్లుగా వున్నంతకాలం, వారి వ్యక్తిగత జీవితాలపై కేవలం గాసిప్స్ మాత్రమే వినిపిస్తాయి. రాజకీయాల్లోకి వస్తే, అవే ప్రత్యర్థి రాజకీయ నాయకులకు ఆయుధాల్లా మారతాయి. అడ్డగోలు రాజకీయ విమర్శల్ని భరించాల్సి వస్తుంది.
స్వర్గీయ ఎన్టీయార్ రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. పుట్టు పూర్వోత్తరాలు తవ్వేయడం, ఏమీ దొరక్కపోయినా.. అందులో ఎక్కడా ఏదో తేడా వుందంటూ మీడియాకెక్కి రాజకీయ నాయకులు బూతులు తిట్టడం.. ఇలాంటివి సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చేవారు తట్టుకోవడం కష్టం.
ఓ కులానికి పరిమితం చేయడం, ఓ మతానికి పరిమితం చేయడం.. ఇవన్నీ రాజకీయ వైపరీత్యాలు. ఇవన్నీ యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి తెలియవని అనుకోలేం. టీడీపీ అవసరం అలాంటిది.. ఎలాగైనా, ఎన్టీయార్‌ని లాక్కొస్తే, పార్టీకి లాభమని కొందరు టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చర్చ తెరపైకొస్తోంది. కానీ, యంగ్ టైగర్ ఎన్టీయార్.. రాజకీయాల్లోకి వస్తే ఏమవుతుందో ఆలోచించుకుని, ఆ దిశగా నిర్ణయం తీసుకుంటే మంచిదేమో.!