మరోసారి సౌత్ సినిమా రీమేక్ లో నటించనున్న సల్మాన్ భాయ్

బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ అప్పట్లో ప్లాపులతో బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన పోకిరి చిత్రాన్ని రీమేక్ చేసి సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాత వరసగా రెడీ, కిక్ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని ట్రాక్ లో పడ్డాడు. అప్పటి నుండి సల్మాన్ ఖాన్ వెనుతిరిగి చూసింది లేదు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఫుల్ బిజీగా ఉన్నాడు. రాధే సినిమా విడుదలకు సిద్ధమైంది. అంతిమ్ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నాడు సల్మాన్ ఖాన్. అలాగే టైగర్ 3 చిత్రంలో నటించాల్సి ఉంది. లాల్ సింగ్ చద్దా, పఠాన్ సినిమాల్లో గెస్ట్ రోల్స్ పోషిస్తున్నాడు.

ఇక సల్మాన్ ఖాన్ ఇప్పుడు మరో సౌత్ సినిమా రీమేక్ పై కన్నేసినట్లు టాక్. తమిళంలో సూపర్ హిట్ సాధించిన మాస్టర్ చిత్రం తెలుగులో ఓ మోస్తరుగా ఆడింది. ఈ సినిమా హక్కులను మురాద్ ఖేతని చేజిక్కించుకున్నాడు. ఆయన సల్మాన్ ను అప్రోచ్ అవ్వగా పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది.