సీఎం జగన్ సొంత జిల్లాలో ‘ప్రైవేట్ హాస్పిటల్ – బ్లాక్ మెయిల్’

‘‘అధికారుల వేధింపుల నేపథ్యంలో ఆసుపత్రిలో కొత్తగా కోవిడ్ 19 బాధితుల్ని చేర్చుకోవడం, వారికి చికిత్స చేయడం మానేస్తున్నాం..’’ అంటూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు బోర్డులు పెట్టాయి. అసలే, కరోనా సునామీ విరుచుకుపడుతోందాయె. అందుబాటులో వున్న ఆసుపత్రులే తక్కువ.. ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయ్.. ప్రైవేటు ఆసుపత్రులదీ అదే పరిస్థితి. ఇలాంటి సమయంలో, ప్రైవేటు ఆసుపత్రులు సహాయ నిరాకరణ చేయడమేంటి.? అది కూడా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ఈ దుస్థితి.

ప్రైవేటు ఆసుపత్రులన్నిటినీ అనలేంగానీ, కొన్ని ఆసుపత్రులు మాత్రం వైద్యం సంగతి పక్కన పెట్టి, మెడికల్ అండ్ హెల్త్ మాఫియా నడుపుతున్నాయన్నది ఓపెన్ సీక్రెట్. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న తేడాల్లేవ్.. అన్ని చోట్లా ఇదే పరిస్థితి. కేవలం 3 వేల రూపాయల ధర పలికే రెమెడిసివిర్ ఇంజెక్షన్ ధర 30 వేలకు ఎగబాకింది. మరో ఇంజెక్షన్ ధర 40 వేలు కాగా, అది దొరకాలంటే నాలుగున్నర లక్షలు ఖర్చు చేయాలి. కరోనా నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు నడుపుతున్న మాఫియాకి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

కరోనా వైరస్ సోకినవారికి ప్రత్యేకమైన మందులంటూ ఏవీ లేవు. కానీ, రెమిడిసివిర్ సహా కొన్ని మందుల్ని ప్రత్యేకంగా ప్రైవేటు ఆసుపత్రులు రాసి పారేస్తున్నాయ్. ఒక రోగి కోసం ఆరు రెమెడిసివిర్ ఇంజెక్షన్లు అవసరమవుతాయి.. అందులోంచి ఒకటి వాడి, మిగిలినవి బ్లాక్ మార్కెట్ వైపుకు మళ్ళిస్తున్నాయి ప్రైవేటు ఆసుపత్రులు. తమ సిబ్బందినే ప్రత్యేకంగా నియమించి, ఈ మాఫియా నడుపుతున్నాయి ఆసుపత్రులు. అయినాగానీ, ప్రభుత్వాలు సదరు ఆసుపత్రులపై కఠినచర్యలు తీసుకోవడంలేదు.

నిజానికి, ఇది ఇప్పుడు కొత్తగా తెరపైకొచ్చిన మాఫియా కాదు.. ఎప్పటినుంచో నడుస్తున్నదే. కరోనా వేళ, చికిత్స అందించబోం.. అని ఆసుపత్రులు తెగేసి చెబుతున్నాయంటే.. వెంటనే, అలాంటి ఆసుపత్రుల్ని ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవాలి. ఇదిలా వుంటే, కరోనా వైద్య చికిత్స కోసం ఆరోగ్యశ్రీ కోటాలో ప్రభుత్వం చెల్లిస్తున్న ధరల్ని పెంచారు. ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సినిమా టిక్కెట్ ధర 100 నుంచి 200 వుంటే, గగ్గోలు పెట్టి, తగ్గించేసిన ప్రభుత్వం, కరోనా వైద్య చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్య శ్రీ ద్వారా చేసే చెల్లింపుల్ని పెంచడమేంటట.? సామాన్యులపై భారం పడకపోవచ్చు.. కానీ, ప్రభుత్వంపై భారం పడుతుంది కదా. ప్రభుత్వమంటే మళ్ళీ ప్రజలే కదా.? ప్రభుత్వాలు ఇలా ఆడుతున్నాయి కాబట్టే, ప్రైవేటు ఆసుపత్రులు ఆడిస్తున్నాయ్.