వరుసగా మూడు సినిమాలు.. వెంకీ మాస్టర్ ప్లాన్ ఇదేనా..??

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.. ప్రస్తుతం మాములు స్పీడ్ లో లేడు. ఇదివరకటి కంటే ఇప్పుడు మూవీస్ పరంగా వేగం పెంచేసాడు. ఇంతకుముందు వెంకీ నుండి ఏడాదికి ఒక సినిమా మాత్రమే విడుదల అయ్యేవి. కానీ ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలను విడుదలకు వరుసలో పెట్టేసాడు. ప్రస్తుతం వెంకీ చేతిలో తమిళ బ్లాక్ బస్టర్ ‘అసురన్’ మూవీ రీమేక్ ఉంది. ఈ ఏడాది ధనుష్ అసురన్ సినిమాకు నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఆ సినిమా ఇప్పుడు తెలుగులో వెంకీ నారప్ప పేరుతో రీమేక్ చేస్తున్నాడు. నారప్పతో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 సీక్వెల్ ఎఫ్3 చేస్తున్నాడు. ఈ రెండు కాకుండా ఈ ఏడాది మలయాళం సూపర్ హిట్ అయినటువంటి దృశ్యం సీక్వెల్ రీమేక్ సినిమాలను సన్నద్ధం చేస్తున్నాడు.

ఈ మూడు సినిమాలు కేవలం నెలల వ్యవధిలో విడుదల కాబోతున్నాయి. నిజానికి వెంకీ నటిస్తున్న నారప్ప దృశ్యం-2 సినిమాలు తమిళ – మలయాళం నుండి రీమేక్స్ కాగా.. ఎఫ్-3 ఒకటే నేరుగా తెలుగులో రెడీ అవుతోంది. అయితే ఊపులో ఊపు అన్నట్లుగా మరో కథకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తుంది. ఈ మధ్యలో సినిమా థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే కరోనా మహమ్మారి కారణంగా సినిమా ఇండస్ట్రీతో పాటు సామాన్యులకు చాలా పెద్ద దెబ్బపడింది. అయితే ఈ కరోనా కారణంగా థియేట్రికల్ రిలీజ్ కావాల్సిన సినిమాలు కూడా ఓటిటి బాటపడుతున్నాయి. త్వరలోనే వెంకీ నుండి కూడా ఓ సినిమా ఓటిటి రిలీజ్ కాబోతుందని టాక్.

ప్రస్తుతం వెంకటేష్ హీరోగా నటిస్తున్న సినిమాల్లో నారప్ప – దృశ్యం-2 సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాయట. ఎఫ్-3కి సంబంధించి ఇంకాస్త షూటింగ్ మిగిలి ఉందట. నిజానికి ఇందులో నారప్ప సినిమా ఈపాటికి రిలీజ్ కావాల్సింది. కానీ రిలీజ్ అనుకున్న ప్రతిసారి కరోనా బ్రేక్ వేసింది. అందుకే ఇప్పుడు సినిమాలకు రిలీజ్ డేట్స్ వెతుకుతున్నారు మేకర్స్. అయితే దృశ్యం సీక్వెల్ ప్రారంభించిన రెండు మూడు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసేసారు. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ నుండి భారీ ఆఫర్స్ వస్తున్నాయట. అందుకే ఇప్పుడు దృశ్యం మేకర్స్ తో పాటు వెంకటేష్ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది. ఇందులో ముందుగా ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి దృశ్యం-2 మూవీ ఓటిటి రిలీజ్ చేసి.. అటెన్షన్ కాపాడుకోవాలని ప్లాన్ చేస్తున్నారని లేటెస్ట్ బజ్. ముందుగా దృశ్యంకు ఓటిటి బాట చూపించి.. థియేటర్స్ ఓపెన్ అయిన వెంటనే నారప్ప సినిమా రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారని సమాచారం. ఇక ఎఫ్-3 ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఆ సినిమా గురించి తర్వాత తెలియజేస్తాం అన్నట్లుగా టాక్ నడుస్తుంది. చూడాలి మరి నిజంగానే వెంకీ ఓటిటి బాటపడతారేమో..!