కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రానిది మొండి వైఖరి.. అంటూ రాష్ట్రాలు దుమ్మెత్తి పోశాయి. ప్రధాని మోడీని గట్టిగా తిట్టగలిగినవారు తిట్టేశారు.. తిట్టలేనివారు మాత్రం సుతిమెత్తగా సన్నాయి నొక్కులు నొక్కారు. కేంద్రమేమో, వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్రాలు బాధ్యతగా వ్యవహరించలేదంటూ ఆరోపించి చేతులు దులుపుకుంది.
అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు.. ఎవరైతేనేం, పాలకులు ప్రజల్ని కరోనా మహమ్మారికి బలి చేసేశారన్నది నిర్వివాదాంశం. ఇపుడు సీన్ రివర్స్ అయ్యింది. అప్పటి బ్లేమ్ గేమ్ అటకెక్కి.. ఇప్పుడు షేమ్ గేమ్ షురూ అయ్యింది. దేశవ్యాప్తంగా అందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ కేంద్రమే చేస్తుందని నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించాక, ‘ఆ ఘనత మాదే..’ అని చెప్పుకుంటున్నాయి ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలు. తెలుగు రాష్ట్రాల్లో ఈ వింత వైఖరి మరీ దారుణంగా తయారైంది.
‘మెడలు వంచడం అంటే ఇదే..’ అంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా గొప్పల డప్పా కొట్టుకుంటున్నాయి. తెలంగాణలో గులాబీ శ్రేణులు కూడా తమ పార్టీ గొప్పతనం గురించి నిస్సిగ్గుగా చెప్పేసుకుంటున్నాయి. నిజానికి, తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, అధికారికంగా కేంద్రంపై మండిపడిన సందర్భాల్లేవు. కేంద్రాన్ని నిలదీసిన పరిస్థితి అసలే లేదు.
ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయితే, కేంద్రాన్ని నిలదీసిన ఝార్కండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కి క్లాస్ తీసుకున్నారు.. సుద్దులు చెప్పేందుకు ప్రయత్నించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కేంద్రం, ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ విషయంలో దిగివచ్చిందంటే, దానిక్కారణం సర్వోన్నత న్యాయస్థానం. వ్యాక్సినేషన్ ప్రక్రియ విషయమై పదే పదే కేంద్రం తీరుని తప్పు పడుతూ వచ్చింది సుప్రీంకోర్టు. వ్యాక్సినేషన్ విధానం అస్సలు బాగా లేదనీ, వ్యాక్సినేషన్ దేశంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా చేయాలనీ సుప్రీంకోర్టు చాలా సార్లు అభిప్రాయపడింది, కేంద్రం తీరుపై మండిపడింది.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఓ మెట్టు దిగక తప్పని పరిస్థితి. దీన్ని తమ ఘనతగా చెప్పుకునేందుకు బులుగు కార్మికులు, గులాబీ కార్మికులు తెలుగు రాష్ట్రాల్లో పడుతున్న పాట్లు చూసి జనం నవ్వుకుంటున్నారు.