‘కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకుని కాపాడుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, చిరంజీవికి గాలమేస్తోంది..’ అంటూ గత కొద్ది రోజులుగా ఓ వర్గం మీడియా, కథనాల్ని నిస్సిగ్గుగా వండి వడ్డిస్తోన్న విషయం విదితమే. ప్రజల్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ, అందులో కులం.. మతం.. ప్రాంతం అనే ప్రాతిపదికన విభజన తీసుకొచ్చి, పబ్బం గడుపుకుంటున్నాయి తెలుగునాట.. అందునా ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు.
వైసీపీ హయాంలో ఏ సామాజిక వర్గానికి అత్యధికంగా పదవులు దక్కుతున్నాయో చూస్తున్నాం.. చంద్రబాబు హయాంలో ఏ సామాజిక వర్గానికి పదవులు కట్టబెట్టుకున్నారో చూశాం.. చిత్రమేంటంటే, ఆ రెండు పార్టీల కనుసన్నల్లో నడిచే మీడియా సంస్థలు ఎప్పుడూ, కాపు సామాజిక వర్గం మధ్యన విభజన తీసుకొచ్చేందుకే ప్రయత్నిస్తుంటాయి.
‘చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ మాత్రమే కావాలి.. బీజేపీ వద్దే వద్దు..’ అంటూ కథనాలు పుట్టుకొస్తాయి. ఏం, ఎందుకు.? చంద్రబాబు, బీజేపీతోనే లాభపడ్డారు రాజకీయంగా.. అదీ రెండు సార్లు. బీజేపీని చంద్రబాబు ఎందుకు వద్దనుకుంటారు.? మామూలుగా అయితే, ఇలా ఆలోచించాలి. కానీ, అక్కడ పవన్ కళ్యాణ్‌ని రాజకీయంగా దెబ్బకొట్టాలి గనుక, ‘తాలింపు’ అలా వేశారన్నమాట.
చిరంజీవికి ‘కాపు’ కోటాలో రాజ్యసభ సీటు వస్తే, కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు వైసీపీకి మళ్ళుతుందన్నది ఇంకో కథనం. స్వయంగా చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే, ఆ కాపు సామాజిక వర్గం మధ్య విభజన ఎలా తీసుకురావొచ్చో చేసి చూపించిన టీడీపీ, వైసీపీ (అప్పటి కాంగ్రెస్ నేతలు).. కేవలం ఓటు బ్యాంకు కోసం చిరంజీవికి రాజ్యసభ సీటు ఎర వేస్తాయా.? వాటికి చిరంజీవి లొంగుతారా.?
కాపు నేతలతోనే పవన్ కళ్యాణ్‌ని తిట్టించారు.. అదే కాపు నేతలతోనే చిరంజీవినీ తిట్టించారు.. ఇప్పుడేమో, కాపు కోటాలో పవన్ కళ్యాణ్‌కి కేంద్ర మంత్రి పదవి రావొచ్చంటున్నారు.. చిరంజీవికి ఎంపీ సీటు దక్కబోతోందని అంటున్నారు. కేవలం ఈ తరహా కథనాలతో క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మన తెలుగు ‘కుల మీడియా‘ (బ్లూ అండ్ యెల్లో)కి తప్ప ప్రపంచ మీడియా రంగంలోనే ఇంకెవరికీ తెలియదేమో.