‘మా’ ఎన్నికల బరిలో జీవిత..! హీటెక్కిన టాలీవుడ్..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు హీటెక్కుతున్నాయి. త్వరలో జరిగే ఎన్నిక‌ల్లో అధ్యక్ష ప‌ద‌వికి ప్రకాశ్ రాజ్‌, మంచు విష్ణు పోటీ పడుతున్నారు. ఇప్పుడీ రేసులోకి జీవితా రాజ‌శేఖ‌ర్‌ చేరారు. ప్రస్తుతం ‘మా’ కార్యద‌ర్శిగా ఉన్నారు జీవిత. అధ్యక్ష పదవికి పోటీలో నిలబడాలనే అనూహ్య నిర్ణయం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో న‌రేశ్ ప్యానెల్ లోనే జీవిత‌, రాజ‌శేఖ‌ర్ ఉన్నారు. వారి ప్యానెల్ గెలిచింది కూడా. అయితే.. కొన్ని నెల‌ల‌కే న‌రేశ్‌తో వీరికి విబేదాలు రావడం.. ఒక‌రిపై మరొక‌రు విమ‌ర్శలు చేసుకునేవరకూ వెళ్లింది.

దీంతో చిరంజీవి, మోహ‌న్‌బాబు, కృష్ణంరాజు, జ‌య‌సుధ వంటి వారు ముందుకొచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. రాజ‌శేఖ‌ర్ వైస్ ప్రెసిడెంట్ ప‌ద‌వికి రాజీనామా చేస్తే.. జీవిత కార్యద‌ర్శిగా కొన‌సాగుతున్నారు. ప్రస్తుత ఎన్నిక‌ల్లో ప్రకాశ్ రాజ్‌, విష్ణు మధ్య పోటీనే వార్తల్లో నిలిస్తే.. జీవిత కూడా పోటీకి దిగడంపై ఆంత‌ర్యం ఏంట‌నే చర్చ మొదలైంది. ఈ ఎన్నికలు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాలి.