కేసులు ఎత్తేసుకున్నది చాలక.. హైకోర్టుపై నిందలా.?

హైకోర్టు తీరుపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారట. అలాగని ‘అక్కుపక్షి’లో రాతలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద గతంలో నమోదైన కొన్ని కేసుల్ని ఇటీవల ఎత్తివేస్తూ నిర్ణయాలు జరిగిపోయాయి. ఈ వ్యవహారంపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టడం సహజంగానే వైఎస్ జగన్ చుట్టూ వుండేవారికి నచ్చదు. అక్షుపక్షికి మరీనూ. అందుకే, చెత్త రాతలు షురూ చేసింది హైకోర్టు తీరుపైన. ఇదో ఫ్యాషన్ అయిపోయింది.. బులుగు మీడియాకి కోర్టుల మీద ‘న్యాయ నిపుణుల’ పేరుతో వివాదాస్పద విశ్లేషణలు చేయడం.

చంద్రబాబు హయాంలో కూడా ఇలాగే కేసుల ఎత్తివేత జరిగిందన్నది అక్కుపక్షిలో కొందరు న్యాయ నిపుణులు చేసిన ప్రస్తావన. నిజమే అయి వుండొచ్చు. ఎవరు చేసినా అది తప్పే. ప్రజా ప్రతినిథుల మీద కేసుల విచారణ.. అంటే, ఆయా ప్రజా ప్రతినిథులు.. నైతికతకు లోబడి, వాటి విచారణకు సహకరించాలి. కానీ, ఆ నైతికత ఈ రోజుల్లో ఏ రాజకీయ నాయకుడి నుంచీ ఊహించలేం. కానీ, ముఖ్యమంత్రి స్థాయిలో వున్న వ్యక్తి కూడా అలా చేస్తే ఎలా.?

చంద్రబాబు హాయాంలో టీడీపీ నేతల మీద ఎత్తివేసిన కేసులంటూ అక్కుపక్షిలో ఓ పెద్ద లిస్టు కనిపించింది. మంచిదే, ఆ కేసుల్ని తిరిగి విచారణ చేపట్టేలా చర్యలు తీసుకునే అవకాశం ప్రస్తుత జగన్ సర్కారుకి వుంది కదా.? వుండీ చేయడంలేదంటే దానర్థమేంటి.? ఇక, చంద్రబాబు హయాంలో.. చంద్రబాబు మీద ఒక్క కేసు అయినా ఎత్తివేసినట్లు, అక్కుపక్షి రాతల్లో కనిపించలేదు. కానీ, ఇక్కడ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద మొత్తం 11 కేసుల్ని ఎత్తివేసినట్లుగా హైకోర్టు తాజాగా తీసుకున్న సుమోటో వ్యవహారంతో స్పష్టమవుతోంది.

ఓ ముఖ్యమంత్రి తన మీద వున్న కేసుల్ని ఎత్తివేయించుకోవడమేంటి.? అన్నదే ఇక్కడ అసలు సిసలు ప్రశ్న. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనిలేదు, కోర్టుల్ని నిందించాల్సిన అవసరం అసలే లేదు. అక్రమాస్తుల కేసు కంటే పెద్దది ఈ 11 కేసుల్లో ఏమీ లేదు కదా.? మరెందుకు అక్కుపక్షి ఇంతలా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు.?

న్యాయస్థానాలపై బురద చల్లడం ద్వారా వాటి ఖ్యాతి తగ్గించడమే లక్ష్యంగా అక్కుపక్షి పనిచేస్తుందనే విషయం సుస్పష్టమవుతోందిక్కడ. ఈ క్రమంలో సోకాల్డ్ న్యాయ నిపుణులు.. అన్యాయమైన విశ్లేషణ చేస్తుండడం వారి వృత్తి ధర్మానికి వెన్నుపోటు పొడవడమే.