ఉస్తాద్ ని ఢీ కొట్టనున్న బన్నీ విలన్..?

ఎనర్జిటిక్ స్టార్ ‘ఉస్తాద్’ రామ్ పోతినేని హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో ‘ఉప్పెన’ బ్యూటీ కృతీ శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ కెరీర్ లో వస్తున్న ఈ 19వ సినిమా రెగ్యులర్ షూటింగ్ నిన్న సోమవారం స్టార్ట్ అయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడిస్తూ రామ్ బ్యాక్ సైడ్ ఫోటోని చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది.

#RAPO19 సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెలుగు తమిళ భాషలో ఏకకాలంలో రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి దీనిపై రోజుకో న్యూస్ వస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య విలన్ గా నటించనున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బైలింగ్విల్ సినిమా కావడంతో ఆర్య లాంటి హీరోని ప్రతినాయకుడిగా తీసుకుంటే మార్కెట్ పరంగా ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాతలు ఆర్య ను సంప్రదిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ఆర్య గతంలో అల్లు అర్జున్ – గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన ‘వరుడు’ సినిమాలో మెయిన్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విశాల్ హీరోగా తెరకెక్కనున్న ‘ఎనిమీ’ చిత్రంలో కూడా ఆర్య నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో ‘RAPO19’ లో రామ్ ని ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

ఇకపోతే ఈ చిత్రానికి రామ్ కు ఉన్న ట్యాగ్ ”ఉస్తాద్” నే టైటిల్ గా ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని అంటున్నారు. అంతేకాదు ఇందులో రామ్ ద్విపాత్రాభినయం చేయనున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. డబ్బింగ్ సినిమాలతో తమిళ హిందీ ప్రేక్షకులకు చేరువైన రామ్ నటిస్తున్న స్ట్రయిట్ తమిళ సినిమా ఇది. అలానే లింగుస్వామి చేస్తున్న మొదటి డైరెక్ట్ తెలుగు సినిమా.

పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ బైలింగ్విల్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకురుస్తున్నారు. ‘దృశ్యం’ ‘లూసిఫర్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన సుజీత్ వాసుదేవ్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. ‘కె.జి.యఫ్’ ఫైట్ మాస్టర్స్ అన్బు-అరివు ద్వయం ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ చేయనున్నారు. ‘క్రాక్’ చిత్రానికి పవర్ ఫుల్ డైలాగ్స్ రాసిన ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు రాస్తున్నారు. జాతీయ పురస్కార గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.