కల్యాణ్ బాబు `పవన్ కల్యాణ్` గా ఎలా మారాడు?

కల్యాణ్ బాబు `పవన్ కల్యాణ్` గా ఎలా మారాడు? .. ఇది అభిమానుల్లో కొందరి ధర్మ సందేహం. నిజానికి ఇంట్లో పవన్ ని `కల్యాణ్ బాబు` అనే పిలుస్తారు. వదినగారైన శ్రీమతి సురేఖ చిరంజీవి చిన్నా అని పిలుస్తారని ఇంతకుముందు కథనాలొచ్చాయి. ఇకపోతే చిన్నప్పుడు అంతా కల్యాణ్ బాబు అనే పిలిచేవారు. పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కల్యాణ్ బాబు. పేరు మార్పు వెనుక అసలు కథ ఏమిటో తెలుసుకుంటే చాలా మ్యాటరే ఉంది.

అదంతా మార్షల్ ఆర్ట్స్ మహిమ. స్కూల్ కాలేజీలో చదువుల్లో కంటే ఆర్ట్స్ లో కల్యాణ్ బాబు యమ స్పీడ్. ముఖ్యంగా మిక్స్స డ్ మార్షల్ ఆర్ట్స్ లో గొప్ప నిష్ణాతుడయ్యారు. 1997 లో కల్యాణ్ సికింద్రాబాద్ లోని హరి హర కాళా భవన్ వద్ద మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన ఇచ్చారు. తన డెమోతో ఆకట్టుకున్న ఇషిన్-రై కరాటే ఇండియా అసోసియేషన్ అతనికి మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో గణనీయమైన విలువను కలిగి ఉన్న `పవన్` బిరుదును ప్రదానం చేసింది. ఈ విధంగా కొణిదెల కల్యాణ్ బాబు కాస్తా పవన్ కళ్యాణ్ అయ్యారు.

పవన్ కల్యాణ్ ఇంతింతై అన్న చందంగా పరిశ్రమ అగ్ర హీరోగా ఎదిగారు. అత్యంత ప్రజాదరణ గలిగిన స్టార్లలో ఓ ప్రముఖ ముంబై మీడియా సర్వే ప్రకారం పవన్ టాప్ 10లో నిలిచిన సంగతి తెలిసిందే.
ఇంతకీ పవన్ కి కరాటే నేర్పించిన గురువు ఎవరు? అంటే.. ప్రపంచ ప్రఖ్యాత కరాటే నిపుణుడు శివమ్ హుస్సేన్ ..ఆయనకు అభిమాన శిష్యుడు పవన్.

మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న అనంతరం నిర్మాతలకు ఇచ్చిన కమిట్ మెంట్లు పూర్తి చేస్తానని మాటిచ్చారు. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గింది కాబట్టి.. అయ్యప్పనమ్ కోషియం రీమేక్ .. క్రిష్ హరి హర వీర మల్లు చిత్రీకరణను పవన్ తిరిగి ప్రారంభించనున్నారు. అలాగే ఆ రెండిటితో పాటు హరీష్ శంకర్- సురేందర్ రెడ్డి చిత్రాలకు ఆయన సంతకం చేశారు.

ఇవన్నీ వరసగా సెట్స్ కెళతాయి. ఆ తర్వాత కూడా పవన్ కి తీరిక లేని షెడ్యూల్ ఉంది. ఓవైపు రాజకీయాల్ని కొనసాగిస్తూనే ఆయన సినిమాలతో పార్టీకి నిధిని సమీకరిస్తున్నారు. అందుకే బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సంతకాలు చేస్తున్నారు. తనని అడిగిన ప్రముఖ నిర్మాతలకు ఆయన కమిట్ మెంట్లు ఇస్తున్నారు.

దిల్ రాజుతో మళ్లీ మళ్లీ:

అలాగే వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆనందంలో నిర్మాత దిల్ రాజుకు మరో సినిమా చేస్తానని పవన్ అప్పట్లో వాగ్ధానం చేశారు. అంతేకాదు.. ఈ సినిమాకి అడ్వాన్స్ తీసుకుని సంతకం కూడా చేసేశారని ప్రచారమవుతోంది. నిర్మాత దిల్ రాజు ఇప్పటికే పని ప్రారంభించారు. పవన్ కి సరైన దర్శకుడిని సెట్ చేసే పనిలో పడ్డారట. పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు రెండో చిత్రం 2022 చివరిలో లేదా 2023 ప్రారంభంలో మొదలుకానుంది.

అయితే అప్పటికి క్యూలో ఉన్న మూడు సినిమాల్ని పవన్ చకచకా పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నటిస్తున్న అయ్యప్పనుమ్ చిత్రంలో రానా ఓ కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని సాధ్యమైనంత తొందరగా రిలీజ్ కి తీసుకురానున్నారు. అలాగే క్రిష్ దర్శకత్వంలో ని హరిహర వీరమల్లు చిత్రం సంక్రాంతి బరిలో రిలీజ్ కానుందని ప్రచారమవుతోంది. 2022 సంక్రాంతి వార్ లో పలు భారీ చిత్రాలతో పోటీపడనుంది.